కష్టాల్లో కంటి పరీక్షలు

– పాడైన పరికరాలు
– సరోజినీ దేవి ఆస్పత్రిలో రోగుల తిప్పలు
– నెలలు గడుస్తున్నా బాగు చేయని వైనం
– ఆ పరీక్షలకు ప్రయివేటే దిక్కు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఒకవైపు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండగా, మరో వైపు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ కంటి ఆస్పత్రి సరోజినీ దేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో మాత్రం పరీక్షలకు అంతరాయం ఏర్పడింది. కంటివెలుగు కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కండ్లకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు చేయడం, సమస్యలను ప్రారంభంలోనే గుర్తించి అప్రమత్తం చేస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అంతే కాకుండా ఈ శిబిరాల్లో రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమైన వారికి అక్కడికక్కడే వాటిని అందజేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్‌ గ్లాసెస్‌ అవసరమైన వారి వివరాలు తీసుకుని వాటిని తయారికి పంపించి అనంతరం పంపిణీ చేస్తున్నారు. వీరు కాకుండా కాటరాక్ట్‌, గ్లకోమా తదితర వ్యాధుల అనుమానితులను గుర్తించి వారిని సంబంధిత ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఇలా సిఫారసు చేస్తున్న రోగుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రికే వస్తుండటం గమనార్హం.
అయితే కంటి వెలుగుకు ముందు సరోజినీకి వచ్చే వారి సంఖ్య ప్రతి రోజు 800 నుంచి 900 వరకు సరాసరిగా ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యి నుంచి 1,200 వరకు నమోదవుతున్నది. అదే విధంగా ఇన్‌ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. గతంలో రోజువారీగా హాస్పిటల్‌ అడ్మిషన్లు 80 వరకూ ఉంటుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 130 వరకు పెరిగినట్టు సమాచారం. ఆస్పత్రిలో చేరుతున్న వారిలో 70 నుంచి 80 మంది వరకు కాటరాక్ట్‌ సమస్యతోనే బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. ప్రతి రోజు వచ్చే రోగుల లక్షణాల ఆధారంగా వారికి తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షలుంటాయి. కంటిలోని రెటీనా వల్ల వచ్చే సమస్యలను తెలుసుకునేందుకు ఒసీటీ స్కాన్‌ చేయాల్సిందే. సరోజినీ దేవి ఆస్పత్రిలో ఈ పరికరం పాడై పోయి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడం గమనార్హం. దీంతో పాటు డయాబెటిక్‌ రెటీనోపతిని గుర్తించేందుకు వాడే గ్రీన్‌ లేజర్‌ అనే పరికరం పరిస్థితి కూడా అలాగే తయారైంది. రెటీనా సంబంధిత అనుమానిత లక్షణాలతో ప్రతి రోజు దాదాపు 30 నుంచి 50 మంది వరకు రోగులు ఈ ఆస్పత్రికి వస్తున్నారు. వీరికి చేయాల్సిన పరీక్షల పరికరాలు పాడై పోవడంతో అనివార్యంగా బయటికి రాస్తున్నారు. ప్రయివేటులో పరీక్షలు చేయిం చుకుందామనుకున్నా ఆ సమీపంలోని ప్రయివేటు డయాగస్టిక్‌ సెంటర్లలో ఈ పరీక్షలు లేకపోవడం, నగరంలోనే కొన్ని చోట్ల మాత్రమే ఉండటంతో రోగులు ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగికి తోడు మరొక సహాయకుడు కూడా రావాల్సి ఉంటుంది. పరీక్షల కోసం వారిని తీసుకుని నగరంలోని కొన్ని చోట్ల మాత్రమే ఉండే పరీక్షల కోసం వెళ్లడం, అక్కడ్నుంచి రిపోర్టు వచ్చేంత వరకు వేచి ఉండి, తిరిగి ఆస్పత్రికి వచ్చే సరికి సమయం దాటిపోతున్నదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతులకు ఆలస్యమెందుకు?
ఏదేనీ ఆస్పత్రిలో పరికరాలు పాడైపోతే బాగు చేసేందుకు గతంలో చాలా కాలం పట్టేది. దీంతో రోగులు ప్రయివేటుకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను తప్పించేందుకు వైద్యారోగ్యశాఖ టీఎస్‌ఎంఐడీసీ పరిధిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత ఆస్పత్రి నుంచి సమాచారం వచ్చిన వెంటనే స్పందించి మరమ్మతులు చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ మేరకు సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో పరికరాలు పాడైన విషయాన్ని ఆ ఆస్పత్రి వర్గాలు వెంటనే సదరు కమిటీకి నివేదించాయి. ఈ విషయాన్ని గత ఐదారు నెలల్లో పలుమార్లు గుర్తుచేశాయి. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాల మరమ్మతు ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ పేరుతో రూ.17.47 కోట్లతో టీఎస్‌ఎంఐడీసీ పరిధిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ పరిస్థితిలో పూర్తిస్థాయి మార్పు రాకపోవడం గమనార్హం.