కంటి జాగ్రత్తలు ఇలా!

Eye care like this!మీ చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోండి, మీ కళ్ళను చేతితో తాకకుండి. టవల్‌, కాంటాక్ట్‌ లెన్స్‌లను వేరే వారితో షేర్‌ చేసుకోవద్దు. వర్షం, గాలి నుంచి మీ కళ్ళను రక్షించడానికి సన్‌ గ్లాసెస్‌ లేదా గ్లాసెస్‌ ఉపయోగించండి. మీ కళ్ళు తడిగా ఉంటే వాటిని శుభ్రమైన, పొడి గుడ్డతో తుడవడం ద్వారా వాటిని పొడిగా ఉంచండి. అవసరమైతే శుభ్రమైన, ఫిల్టర్‌ చేసిన నీటితో మీ కళ్ళను కడగాలి. పరిశుభ్రత సరిగా లేని కొలనుల వంటి నీటి ప్రదేశాల్లో ఈత కొట్టకూడదు.
బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ నివాసం, పని ప్రదేశాలను శుభ్రంగా ఉంచండి. మీ లెన్స్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి.
వర్షాకాలంలో కంటి ఇన్‌ఫెక్షన్లు కూడా పెరుగుతాయి. తేమ, వర్షపు నీరు, బాక్టీరియా, వైరస్‌ల పెరుగుదల చాలా ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. వర్షాకాలంలో వచ్చే కొన్ని సాధారణ కంటి ఇన్ఫెక్షన్లును తెలుసుకుందాం.
కంజెక్టివైటీస్‌
దీనినే పింక్‌ ఐ అని కూడా పిలుస్తారు, ఇది సాధారణంగా వైరస్‌లు లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కండ్లు ఎరుపు రంగులోకి మారి దురద వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది.
డాక్రియోసిస్టిటిస్‌
ఈ రకమైన ఇన్ఫెక్షన్‌, టియర్‌ (లాక్రిమల్‌) గ్రంథిలో ఏదైనా అడ్డుపడటం వల్ల ఏర్పడుతుంది. కన్ను నొప్పిగా ఉండటం, ఎర్రగా అవ్వడం, కన్ను లోపల వాపు ఉండటం దీని లక్షణాలు.
బ్లేఫరిటిస్‌(కనురెప్పల ఉబ్బడం)
బ్లెఫారిటిస్‌ వల్ల కనురెప్పలు వాపుగా ఉంటాయి. ఈ రకమైన ఇన్‌ఫెక్షన్‌లో కన్ను ఎర్రగా అవుతుంది. కన్ను దురదగా ఉండటం, కనురెప్పలు ఉబ్బి ఉంటాయి.
కంటికురుపు
హార్డియోలమ్‌ అని కూడా పిలుస్తారు. ఇది కనురెప్పలో తైల గ్రంథుల ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంది. సాధారణంగా స్టెఫిలోకాకస్‌ బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. దీని వల్ల కన్ను ఎరుపు రంగులోకి మారి, కురుపు ఏర్పడి నొప్పి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలి.