– సిక్కింతో హైదరాబాద్ ఢీ
– నేటి నుంచి రంజీ మ్యాచ్
హైదరాబాద్ రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో అదరగొడుతున్న హైదరాబాద్.. ముచ్చటగా మూడో విజయంపై కన్నేసింది. తొలి రెండు మ్యాచుల్లో మేఘాలయ, నాగాలాండ్‌పై బోనస్ పాయింట్లతో గెలుపొందిన హైదరాబాద్ ప్లేట్ డివిజన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. నేడు హైదరాబాద్ వేదికగా జరుగున్న మ్యాచ్‌లో సిక్కింతో తలపడనుంది. టీ20 సిరీస్ ముగియటంతో రెగ్యులర్ కెప్టెన్ తిలక్ వర్మ నేడు హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతాడా లేదంటే విశ్రాంతి తీసుకుంటాడా అనేది తెలియాలి. తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రాహుల్ సింగ్ సహా తన్మరు అగర్వాల్, చందన్ సహాని, రోహిత్ రాయుడు మంచి ఫామ్‌లో ఉన్నారు. రవితేజ, చామ మిలింద్, తనరు త్యాగరాజన్‌లు బంతితో రాణిస్తున్నారు. సిక్కిం సైతం తొలి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించింది. ఇటు హైదరాబాద్, అటు సిక్కిం హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టాయి. బలమైన హైదరాబాద్‌కు ఎదురొడ్డి.. సిక్కిం నాలుగు రోజుల పాటు పోరాడగలదా? ఆసక్తికరం. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్, సిక్కిం రంజీ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం.