కండ్ల పొంటి నీళ్లొస్తున్నయి…

సిన్నప్పుడు…
పుస్తకాల సంచి భుజానికేసుకుని
చేతుల టిఫిన్‌ డబ్బా వట్టుకుని
దోస్తులందరం కలిసి
ముచ్చట్లు వెట్టుకుంట
మోహన్‌ రావుపేట బడికి వొయ్యేటోల్లం
అట్లా…బడికి వోతుంటే ఎంత గమ్మతనిపించేది
ఊల్లె ఉన్న ముచ్చట్లన్నీ మా నోల్లల్ల బొంగురాలాడేవి
పొలాల ఒడ్ల మీదికెల్లి నడుసుకుంట పోంగ పోంగ జారిపడితే…
పెయి నిండ బురదనే

అది బురదనే గని గంధం లెక్కనిపించేది
పక్కకే పారుతున్న ఒర్రెల నీళ్ల తోటి బట్టలకంటిన బురదను కడుక్కొని
పాటలు పాడుకుంట వొయ్యేటోల్లం
నర్సయ్య తాత పొలం దున్నుతుంటే
బడిని మర్సిపోయి ఒడ్డు మీద నిలవడి అట్లనే సూసేటోల్లం…
భూమితల్లి గుండెల నిండా వున్న
మట్టి ముద్దలన్నీ అన్నం ముద్దలై కనవడేవి
ఆ ఒడ్డు మీద కూసుంటే
అమ్మ ఒడిల కూసున్నట్లనిపించేది…
ఒక్కసారి ఉలిక్కి పడి లేచి
పక్కనే వున్న సేన్లల్ల
పల్లి కాయలు,పెసరి కాయలు తెంపుకొని
తినుకుంట బడి తోవ వట్టేటోల్లం

పగటీలి…అన్నం తినేటందుకు
బడెనుక వున్న
మంచి నీళ్ల బాయి కాడికి వోయి
ముత్తైదువలు వాయినమందిచ్చుకున్నట్లు
ఒక్కోల్ల కూరలు ఒక్కోల్లు పంచుకుని తినేటోల్లం
టిఫిన్‌ డబ్బాకు దారం కట్టి
బొక్కెనతో చేదుకున్నట్లు
బాయిల నీళ్లు చేదుకునేటోల్లం
తిన్నంక చింత చెట్టు కింద
పండుకుంటే ఎంత హాయనిపించేది
నాయిన భుజం మీద పడుకున్నట్లనిపించేది

ఎన్ని ఆటలు, ఎన్ని పాటలు
ఎన్ని కబుర్లు, ఎన్ని అల్లర్లు
ఆ రోజులే వేరు
ఆ ప్రేమలే వేరు
ఇప్పుడు అవన్నీ ఏడ వోయినయో
ఆ ఈత పండ్లు, ఆ నేర వండ్లు ఏడవోయినయో
ఇప్పుడు అన్నీ నకిలీ మనుషులు నకిలీ
మమతలు నకిలీ అంతా నకిలీ…
ఇప్పుడు ఆ రోజులు యాదికొస్తుంటే…
కండ్ల పొంటి నీళ్లొస్తున్నయి…
గుండెలన్నీ బరువెక్కుతున్నయి…
మనసుల నిండా సీకట్లు ముసురుకొంటున్నయి…
– తిరునగరి శ్రీనివాసస్వామి, 9440369939