కలియుగానికి క్లైమాక్స్‌ ఉంటే?

కలియుగానికి క్లైమాక్స్‌ ఉంటే?ప్రభాస్‌ నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిక్‌ ‘కల్కి 2898 ఎడి’. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా రిలీజైన ‘భైరవ అంథమ్‌’ బిగ్గెస్ట్‌ సాంగ్‌ అఫ్‌ ది ఇయర్‌గా టాప్‌ చార్ట్‌లో ఉంది. ఈ ఎగ్జైట్‌మెంట్‌ని మరింతగా పెంచుతూ మేకర్స్‌ ‘ఎపిక్‌ జర్నీ ఎపిసోడ్‌ 1 – ది ప్రిల్యూడ్‌ ఆఫ్‌ కల్కి 2898 ఎడి’ని రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ,’ఈ కథ బేసిక్‌గా అన్నింటికి క్లైమాక్స్‌. కలియుగంలో ఏం జరుగుతుంది? ఏం జరగొచ్చు?, ఇలాంటి వాటన్నింటికీ ఇది క్లైమాక్స్‌. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఈ కథకు రిలేట్‌ అవుతారు. చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టం. ‘పాతాళభైరవి’, ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’ నాకు ఇష్టమైన సినిమాలు. హాలీవుడ్‌ ‘స్టార్‌ వార్స్‌’ లాంటి సినిమా చూసినప్పుడు చాలా బావున్నాయనిపించాయి. అయితే ఇవి మన కథలు కావా? ఎప్పుడూ వెస్ట్‌లోనే జరగాలా? అనిపించేది. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కష్ణవతారంతో అది ఎండ్‌ అవుతుంది. అక్కడి నుంచి కలియుగంకు ఎంటరైనప్పుడు ఈ కథ ఎలా వెళ్తుతుందనేది ప్యూర్‌ క్రియేటివ్‌ ఇమాజినేషన్‌. దీన్ని కథగా రాయలనుకున్నా. మనం చదివిన పురాణాలు, ఎపిక్స్‌ అన్నింటికి ఒక క్లైమాక్స్‌లా ఈ సినిమా ఉంటుంది. ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరోయుగంలో దుర్యోధనుడు… ఇలా అన్నింట్లో ఒక రూపం తీసుకొని కలియుగంలో ఒక అల్టిమేట్‌ ఫైనల్‌ రూపం తీసుకుంటే అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఐడియాతో రాసుకున్నది. ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సరికొత్త ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మైథాలజీ అటెంప్ట్‌ని చూసి ప్రేక్షకుల ఎలా రియాక్ట్‌ అవుతారని క్యూరియస్‌గా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. ‘ప్రేక్షకులకు సరికొత్త ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్‌ వండర్‌గా అందించేందుకు దర్శక,నిర్మాతలు అన్ని హంగులతో సిద్ధం చేశారు’ అని చిత్ర బృందం తెలిపింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈచిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.