హాజరుకు ఫేస్‌ అథంటికేషన్‌

– ‘ఉపాధి హామీ’లో మోడీ సర్కారు యత్నాలు
– వచ్చే ఏడాది ప్రవేశపెట్టటానికి ప్లాన్‌
– సామాజిక కార్యకర్తలు, కార్మికుల ఆందోళన
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) చట్టం కింద లబ్దిదారుల హాజరును గుర్తించేందుకు కేంద్రం కొత్త ప్రణాళికతో ముందుకొస్తున్నది. ఇందుకోసం ఫేస్‌ అథంటికేషన్‌ను తీసుకురావాలని చూస్తున్నది. దీనిని వచ్చే ఏడాది అమలు చేయాలని చూస్తున్నది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)ను కొత్త ఫీచర్‌ని పరీక్షించి, దాని అమలుకు సిద్ధం చేయాలని కోరింది. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌)లో ఫేస్‌ అథెంటికేషన్‌(రికగ్నిషన్‌) ఫీచర్‌ను చేర్చామని మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులు తెలిపారు.
గత నెలలో రాష్ట్రాలు, యూటీలకు విధివిధానాలను వివరించడానికి మంత్రిత్వ శాఖ ఒక ప్రజెంటేషన్‌ చేసింది. ”గత వారం, మేము రాష్ట్రాలు, యూటీలను ఫీచర్‌ని పరీక్షించడం ప్రారంభించాలని చెప్పాం. దీనితో అవాంతరాలను పరిష్కరించవచ్చు. రాష్ట్రాలు, యూటీల అంతటా దీని అమలుకు సిద్ధం కావాలని కూడా కోరాం. ఇది పథకం అమలులో మరింత పారదర్శకతను తెస్తుంది. నిజమైన కార్మికులు మాత్రమే వర్క్‌సైట్‌లలో ఉండేలా చూస్తుంది” అని మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిని త్వరలోనే తీసుకురావాలన్నది తమ ప్లాన్‌ అని చెప్పారు. కానీ ఇది ఐచ్ఛికమనీ, హాజరు ఇప్పటికీ ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో మాన్యువల్‌గా గుర్తించబడుతున్నదని వివరించారు.
ప్రభుత్వం తీసుకురావాలని యోచిస్తున్న కొత్త ఫీచర్‌ ప్రకారం.. ప్రామాణీకరణ కోసం యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ)తో కార్మికుడి (లబ్దిదారుడు, వర్కర్‌) ముఖం స్కాన్‌ చేయబడి, అది వారి ఆధార్‌ డేటాతో సరిపోల్చబడుతుంది. సదరు వ్యక్తి పనికి నివేదించినప్పుడల్లా వర్కర్‌ ముఖం హాజరు కోసం స్కాన్‌ చేయబడుతుంది. యూఐడీఏఐ డేటాతో ముఖ ప్రామాణీకరణ ఒక్కసారి మాత్రమే చేయబడుతుందని ఒక అధికారి తెలిపారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ ప్రస్తుతం తెలంగాణ, కర్నాటక వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్‌ పంపిణీకి, అధికారుల హాజరును గుర్తించడానికి, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయడానికి ఉపయోగిస్తున్నాయి.
అయితే, కొత్త హాజరు విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్న మోడీ సర్కారు ప్రయత్నాలు సామాజిక కార్యకర్తలు, కార్మికుల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. డిజిటల్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌లాగానే.. మారుమూల ప్రాంతాలలో ఉన్న ఉపాధి కార్మికులకు నెట్‌ సేవలతో ఫేషియల్‌ రికగ్నిషన్‌ తీసుకొస్తే అది సమస్యలను తీసుకొస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తప్పుడు హాజరును, అవినీతిని నిరోధించటం కోసం తీసుకురావాలని చూస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నదనీ, అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రయత్నం ఎంత వరకు విజయం సాధించగలదనేదే పెద్ద ప్రశ్న అని సామాజిక కార్యకర్త, మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ (ఎంకేఎస్‌ఎస్‌) సహ వ్యవస్థాపకుడు, ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చా సభ్యుడు నిఖిల్‌ డే అన్నారు. ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీకి అధిక నాణ్యతతో కూడిన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అవసరమనీ, మారుమూల గ్రామాల్లో ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం ఒక్కసారి ప్రవేశపెడితే.. కార్మికులకు ఇబ్బందులు తప్పవనీ, ఉపాధి హామీ కార్యక్రమం నీరుగారే ప్రమాదమున్నదని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉపాధిని కల్పించే ఈ పథకం ఆ తర్వాత గాడి తప్పే ప్రమాదమున్నదని ఆందోళన వెలిబుచ్చారు. నిజమైన లబ్దిదారుల కోసమే ఇలాంటి ప్రయత్నాలు అని మోడీ సర్కారు చెప్తున్నది. 2022-23లో, 5.18 కోట్ల మంది కార్మికుల పేర్లు ‘ఉపాధి హామీ’ పథకం నుంచి తొలగించబడ్డాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటులో వెల్లడించటం గమనార్హం.ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఈ సమస్యకు తెరపడుతుందని అధికారులు అంటున్నారు. మోడీ సర్కారుకు ఆది నుంచీ ఉపాధి హామీపై చిన్న చూపే ఉన్నదనీ, ప్రతి ఏడాది ఈ పథకానికి బడ్జెట్‌లో కోతలు విధిస్తున్నదని సామాజిక కార్యకర్తలు, కార్మికులు ఆరోపించారు. అలాగే, ఈ పథకం కింద చెల్లింపుల కోసం కానీ, హాజరు కోసం కానీ, లబ్దిదారులకు పని కల్పించే విషయంలో కానీ మోడీ సర్కారు తిరోగమన విధానాలతో ముందుకొస్తున్నదనీ, ఫేస్‌ అథంటికేషన్‌ కూడా అలాంటిదేనని వారు అంటున్నారు.