– పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లాలో అమలు
– విద్యాశాఖ సంచాలకులు : ఈవి నరసింహారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ సాధారణ గురుకులాలు, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి ఈనెల 10న ఉత్తర్వులు జారీచేశారు పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లాలో అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఆ జిల్లా విద్యాధికారి (డీఈవో)కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. నోడల్ అధికారి పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్’ యాప్‌ను రూపకల్పన చేశామని వివరించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వినియోగించే మొబైల్ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా ప్రతిరోజూ విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కూడా దీన్ని అందుబాటులోకి తేవాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ అమల్లోకి రాలేదు. పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లిలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేసిన తర్వాత అక్కడి అనుభవాలను బట్టి మిగిలిన అన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేయడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించనుంది. వచ్చే విద్యాసంవత్సరంలోగా అన్ని జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని అమలు చేసే అవకాశమున్నది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఫొటోలను ప్రదర్శించాలని విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. బడులకు గైర్హాజరు కావడంతోపాటు ఒకరికి బదులుగా మరొకరు విధులు నిర్వహించుండా విద్యాశాఖ చర్యలు చేపడుతున్నది. రాష్ట్రంలో 26,040 ప్రభుత్వ పాఠశాలల్లో 21,50,626 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,07,259 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డైట్ కాలేజీల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం (2024-25) నుంచే డైట్ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులకు కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.