– మే 7 నుంచి 11 వరకు రాతపరీక్షలు
– అగ్రికల్చర్, ఫార్మసీకి 135, ఇంజినీరింగ్‌కు 166 కేంద్రాలు
– రికార్డు స్థాయిలో 3,54,803 మంది దరఖాస్తు
– మెహందీ, టాటూలు వేసుకురావొద్దు
– వాటర్ బాటిళ్లకు అనుమతి లేదు
– నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ : ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ నర్సింహారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ (ఎంసెట్) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి చెప్పారు. మొదటిసారి అభ్యర్థులకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. వచ్చేనెల ఏడు నుంచి 11 వరకు ఎప్‌సెట్ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. అదేనెల ఏడు, ఎనిమిది తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం, తొమ్మిది నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలు జరుగుతాయని వివరించారు. ఇంజినీరింగ్‌కు 2,54,543 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1,00,260 మంది కలిపి మొత్తం 3,54,803 మంది అభ్యర్థులు రికార్డు స్థాయిలో దరఖాస్తు చేశారని అన్నారు. ఇందు కోసం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 135, ఇంజినీరింగ్ విభాగానికి 166 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ గతం కంటే 20 అదనంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. సోమవారం నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. ప్రతిరోజూ రెండు విడతల్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రాతపరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఉదయం 7.30 నుంచి, మధ్యాహ్నం 1.30 నుంచి అంటే పరీక్షా ప్రారంభానికి 90 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు.
నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్షా కేంద్రాలను చూసుకోవాలనీ, సకాలంలో పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచించారు. ఒకేరోజు జాతీయ స్థాయి పరీక్షలుంటే ముందే సమాచారం ఇవ్వాలన్నారు. బయోమెట్రిక్ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులు మెహందీ (గోరింటాకు), టాటూలు వేసుకురావొద్దని కోరారు. బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్ను, హాల్‌టికెట్, దరఖాస్తు ఫారం, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులైతే కుల ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాలని చెప్పారు. వాటర్ బాటిళ్లు తెచ్చుకోవద్దనీ, పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. కాలిక్యులేటర్లు, మ్యాథమెటికల్, లాగ్ టేబుళ్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, చేతిగడియారం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రాల్లోకి తెచ్చుకోవద్దని సూచించారు. అభ్యర్థులకు ఇబ్బందుల్లేకుండా ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూహెచ్, టీసీఎస్ జాగ్రత్తలు తీసుకున్నా యని అన్నారు. సమస్యలుంటే హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించాలన్నారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర:// వaజూషవ్.్‌రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి కోరారు. గతేడాది కంటే ఏపీ నుంచి రెండు వేల మంది తక్కువగా దరఖాస్తు చేశారని అన్నారు.
ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశాలు : విజరుకుమార్‌రెడ్డి
ప్రవేశాల ప్రక్రియ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ ప్రామాణికమని ఎప్‌సెట్ కో కన్వీనర్ విజరుకుమార్‌రెడ్డి చెప్పారు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ ఉంటుందన్నారు. ఈ నెలాఖరులోగా ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎప్‌సెట్ కన్వీనర్ బి డీన్‌కుమార్, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరావు, పీజీఈసెట్ కన్వీనర్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.