పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి

– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 

– ఉపాధి హామీ పనుల పరిశీలన

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వేసవి ఎండలు ముదురుతున్నందున ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఉపాధి హామీ సిబ్బందికి  ఎంపిడిఓ చింత రాజ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీల హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్నందున పని ప్రదేశంలో కూలీలు సేద తీరేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ఎండల బారిన పడకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. కొలతల ప్రకారం పక్కాగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. పని ప్రదేశంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కూలీలకు సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, మెట్లు, తదితరులు ఉన్నారు.