హైదరాబాద్‌కు ఎదురుందా?

– నాగాలాండ్‌తో నేడు సెమీఫైనల్‌
– రంజీ ట్రోఫీ ప్లేట్‌ లీగ్‌ 2024
హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీ ఎలైట్‌ లీగ్‌లో అడుగుపెట్టడమే లక్ష్యంగా ఈ ఏడాది రంజీ ట్రోఫీ ప్లేట్‌ బరిలో దిగిన హైదరాబాద్‌.. ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. గ్రూప్‌ దశలో ఐదు మ్యాచుల్లోనూ ఏకపక్ష విజయాలు నమోదు చేసిన హైదరాబాద్‌ నేడు కీలక సెమీఫైనల్స్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా నాగాలాండ్‌తో సెమీఫైనల్లో తలపడనుంది. అజేయ రికార్డుతో సెమీస్‌కు చేరుకున్న హైదరాబాద్‌ ఇక్కడా ఏకపక్ష విజయంపై కన్నేసింది. లీగ్‌ దశ తొలి మ్యాచ్‌లో నాగాలాండ్‌పై హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో రెండు రోజుల్లోనే గెలుపొందింది. తాజా సెమీస్‌ సమరానికి కెప్టెన్‌ తిలక్‌ వర్మ సైతం జట్టులోకి రావటంతో హైదరాబాద్‌ మరింత పటిష్టంగా తయారైంది. తిలక్‌ వర్మ, రాహుల్‌ సింగ్‌, తన్మరు అగర్వాల్‌, రోహిత్‌ రాయుడు భీకర ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లలో తనరు త్యాగరాజన్‌, కార్తికేయ కక్‌ సహా రవితేజ ఫామ్‌లో ఉన్నారు. సొంత గడ్డపై హైదరాబాద్‌ను ఎదుర్కొని రెండు రోజుల పాటు పోటీ పడటం సైతం నాగాలాండ్‌కు కఠిన పరీక్ష కానుంది. హైదరాబాద్‌, నాగాలాండ్‌ రంజీ ట్రోఫీ ప్లేట్‌ లీగ్‌ సెమీఫైనల్‌ నేడు ఉదయం 9.30 గంటలకు ఆరంభం. రంజీ ట్రోఫీ నాకౌట్‌ మ్యాచులు ఐదు రోజుల ఫార్మాట్‌లో ఉంటుంది.