భారత్‌కు ఎదురుందా?

– అఫ్గనిస్థాన్‌తో రోహిత్‌సేన ఢ నేడు
–  వరుసగా రెండో విజయంపై గురి
–  మధ్యాహ్నాం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
–  2023 ఐసీసీ ప్రపంచకప్‌
ఐసీసీ 2023 ప్రపంచకప్‌లో ఆతిథ్య టీమ్‌ ఇండియా మరో సవాల్‌కు సిద్ధమైంది. చెపాక్‌లో ఆస్ట్రేలియాను స్పిన్‌తో దెబ్బకొట్టిన రోహిత్‌సేన.. నేడు ఫిరోజ్‌ షా కోట్లలో అఫ్గాన్‌ నుంచి స్పిన్‌ సవాల్‌ ఎదుర్కొంటుంది. పరుగుల పిచ్‌ కోట్లలో స్పిన్నర్ల పాత్ర నామమాత్రమే అయినా.. నాణ్యమైన అఫ్గాన్‌ స్పిన్నర్లు భారత్‌కు సవాల్‌ విసిరేందుకు రెఢ అవుతున్నారు. ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయంపై కన్నేసిన టీమ్‌ ఇండియా నేడు అఫ్గనిస్థాన్‌తో తలపడనుంది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఆస్ట్రేలియాపై అదిరే విజ యంతో ఐసీసీ 2023 ప్రపంచకప్‌ వేటను మొదలుపెట్టిన టీమ్‌ ఇండియా.. గ్రూప్‌ దశలో రెండో సవాల్‌కు సిద్ధమైంది. టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాటర్లు సున్నా పరుగులకే నిష్క్రమించినా.. క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించిన రోహిత్‌సేన అత్యంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. మరోవైపు అఫ్గనిస్థాన్‌ తొలి మ్యాచ్‌లో మంచి జట్టునే బరిలో నిలిపినా.. పరాజయం తప్పలేదు. భారత్‌ వరుసగా రెండో విజయంపై కన్నేసి నేడు బరిలోకి దిగుతుండగా.. టైటిల్‌ ఫేవరేట్‌, ఆతిథ్య భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే తపన అఫ్గనిస్థాన్‌ శిబిరంలో కనిపిస్తోంది. న్యూఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల (అరుణ్‌ జైట్లీ స్టేడియం) మైదానంలో భారత్‌, అఫ్గనిస్థాన్‌ ప్రపంచకప్‌ సమరం నేడు.
పరుగుల పండుగే!
స్పిన్‌ స్వర్గధామం చెపాక్‌లో టీమ్‌ ఇండియా బ్యాటర్లు జూలు విదిల్చేందుకు అవకాశం చిక్కలేదు. ఆరంభంలోనే మూడు వికెట్లు నేలకూరటంతో.. విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ టెస్టు క్రికెట్‌ నైపుణ్యంతో భారత్‌ను ఒడ్డున పడేశారు. రెండో మ్యాచ్‌ వేదిక ఫిరోజ్‌ షా కోట్ల పరుగుల పండుగకు కేరాఫ్‌ అడ్రస్‌. దీంతో భారత్‌ భారీ స్కోరు సాధించటంపై దృష్టి నిలుపనుంది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అనారోగ్యంతో నేటి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతడి స్థానంలో యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ మరోసారి ఓపెనర్‌గా రానున్నాడు. రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ సహా శ్రేయస్‌ అయ్యర్‌ ఇక్కడి పిచ్‌పై భారీ ఇన్నింగ్స్‌లపై కన్నేశారు. గత ప్రపంచకప్‌లో సెంచరీల మోత మోగించిన రోహిత్‌ శర్మ ఇప్పుడు సారథిగా అదే తరహా ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నాడు. లోకల్‌ బార్సు విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌లకు ఈ పిచ్‌పై చక్కటి అవగాహన ఉంది. ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటం అఫ్గనిస్థాన్‌ బౌలర్లకు కష్టతరమే. కెఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజాలు సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నారు. పరుగుల పిచ్‌పై మూడో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జడేజాతో కలిసి కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలు తీసుకోనుండగా.. బుమ్రా, సిరాజ్‌లు పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.
స్పిన్‌ బలంతో..
అఫ్గనిస్థాన్‌ అతిపెద్ద బలం స్పిన్‌ బౌలింగ్‌. ప్రపంచ మేటి మాయగాడు రషీద్‌ ఖాన్‌ సహా ముజీబ్‌ రెహమాన్‌ ఆ జట్టు సొంతం. రషీద్‌ ఖాన్‌ను ఎదుర్కొవటం ఎంతటి బ్యాటర్‌కు అయినా సవాల్‌తో కూడుకున్నదే. ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో స్పిన్‌ ప్రభావం తక్కువ అయినా.. అఫ్గాన్‌ మాయపైనే ఎక్కువగా అంచనాలు పెట్టుకుంది. అయితే ఒక్క స్పిన్‌ విభాగం నైపుణ్యంతో భారత్‌ వంటి అగ్రజట్లను ఓడించలేమనే సంగతి అఫ్గాన్‌కు బాగా తెలుసు. అందుకే ఆ జట్టులో బ్యాటర్లు సైతం సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఓపెనర్‌ రెహ్మనుల్లా గుర్బాజ్‌ ధనాధన్‌ ఆటకు పెట్టింది పేరు. అతడు ఆరంభంలో కుదురుకుంటే వేగంగా పరుగులు పిండుకోగలడు. ఇబ్రహీం జద్రాన్‌, రెహమత్‌ షా, కెప్టెన్‌ హస్మతుల్తా షాహిదిలు సైతం బ్యాట్‌తో మెరిస్తే.. అఫ్గాన్‌కు మంచి అవకాశాలు ఉంటాయి. కానీ నాణ్యమైన భారత పేస్‌, స్పిన్‌ బౌలర్లను ఎదురొడ్డి అఫ్గాన్‌ బ్యాటర్లు నిలిచేది అనుమానమే. మేటి జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడే అవకాశం అఫ్గనిస్థాన్‌ వంటి జట్లకు పెద్దగా రాదు. కానీ ఆ జట్టు ఇటీవల ప్రతి ఐసీసీ, ఏసీసీ టోర్నీలకు నిలకడగా అర్హత సాధిస్తూ మెగా జట్లతో మహా పోరు చేస్తోంది. నేడు భారత్‌తో మ్యాచ్‌ అఫ్గనిస్థాన్‌కు కీలకం కానుంది.
పిచ్‌, వాతావరణం
ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో గత మ్యాచ్‌లో ప్రపంచ కప్‌ రికార్డులు బద్దలయ్యాయి. శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. నేడు అఫ్గాన్‌తో భారత్‌కు సైతం అటువంటి పిచ్‌నే సిద్ధం చేశారు. దీంతో భారత క్రికెట్‌ అభిమానులకు పరుగుల విందు ఖాయమని చెప్పవచ్చు. ఇక్కడ టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునేందుకు అవకాశం కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కాస్త తక్కువనే చెప్పవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.
అఫ్గనిస్థాన్‌ : రెహ్మానుల్లా గుర్బాజ్‌ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్‌, రెహమాత్‌ షా, హస్మతుల్లా షాహిది (కెప్టెన్‌), మహ్మద్‌ నబి, నజీబుల్లా జద్రాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జారు, రషీద్‌ ఖాన్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌, ముజీబ్‌ రెహమాన్‌, ఫజహల్‌హాక్‌ ఫరూకీ.
ఆ రెండూ తెలుసు!
పొట్టి ఫార్మాట్‌లో అన్ని వేగంగా మారిపోతాయి. కానీ వన్డే క్రికెట్‌ అందుకు భిన్నం. ఇక్కడ నిలకడ సాధించటం సాధారణ విషయం కాదు. ఎప్పుడు నెమ్మదించాలి, ఎప్పుడు సహనంతో ఉండాలి, ఎప్పుడు దండయాత్ర చేయాలనే అనుభవం, వివేకం వన్డే క్రికెట్‌లో బ్యాటర్లకు అనివార్యం. లేదంటే ఒత్తిడిని ఎప్పుడు తట్టుకోవాలి, ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి ఎప్పుడు నెట్టాలనే అంశంలో తికమక పడి గందరగోళంలో పడటం ఖాయం. సరైన లెంగ్త్‌, లైన్‌ అందుకుని పదే పదే అక్కడే బంతులు సంధించే నైపుణ్యం, అనుభవం సైతం బౌలర్లకు వన్డే క్రికెట్‌లోనే అబ్బుతుంది. భారత జట్టులో ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు ఈ విషయంలో ముందంజలోనే ఉన్నారు. అందుకు సరైన ఉదాహారణ చెన్నై చెపాక్‌లో ఆస్ట్రేలియాతో ప్రదర్శన. ఆపద అనిపించినప్పుడు పది బంతులు డిఫెన్స్‌ ఆడటమూ తెలుసు.. అవసరం అనిపించినప్పుడు అదే బౌలర్లను చిత్తు చేయటమూ మనోళ్లకు బాగా తెలుసు. ఫిరోజ్‌ షా కోట్ల పరుగుల పిచ్‌ అయినా.. ఎప్పుడు ఏ బౌలర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆడాలనేది సైతం కీలకం. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా.. కథ మారిపోతుంది. అఫ్గనిస్థాన్‌ ఈ విషయంలో ఇప్పుడు అనుభవం గడించాల్సి ఉండగా.. టీమ్‌ ఇండియా ఈ అంశంలో ‘మాస్టర్స్‌’ చేసింది. నేడు ఈ రెండు జట్ల మధ్య ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఇదే అతిపెద్ద వ్యత్యాసంగా నిలువనుంది. అంతిమంగా, మ్యాచ్‌ ఫలితాన్ని ఇది శాసిస్తుంది.