– నేడు అమెరికాతో టీమ్ ఇండియా ఢీ
– మరో సంచలనంపై ఆతిథ్య జట్టు ఆశలు
– ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024
– రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
పాకిస్థాన్‌పై సూపర్ విక్టరీ సాధించిన ఉత్సాహంలో ఉన్న ఆతిథ్య అమెరికా.. పాక్‌ను తనదైన శైలిలో మళ్లీ చిత్తుగా ఓడించిన భారత్ నేడు ముఖాముఖికి సిద్ధమయ్యాయి. మెరుపు విజయాలు నమోదు చేసిన అమెరికా సూపర్8 బెర్త్‌పై కన్నేయగా.. గ్రూప్‌లో అగ్రస్థానంతో సూపర్ 8కు చేరుకోవాలని రోహిత్ శర్మ భావిస్తోంది. సంచలన జట్టు అమెరికా మరో వండర్‌పై ఆశలు పెట్టుకోగా.. టీమ్ ఇండియా మరో ఏకపక్ష విజయంపై కన్నేసి బరిలోకి దిగుతోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్, అమెరికా పోరు నేడు.
నవతెలంగాణ-న్యూయార్క్
ప్రపంచ క్రికెట్ అగ్రజట్టు భారత్‌తో పసికూన అమెరికా తొలిసారి ముఖాముఖి పోరుకు సిద్ధమైంది. ఆతిథ్య జట్టుగా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అమెరికా గ్రూప్-ఏలో ఇప్పటికే సంచలన విజయాలు నమోదు చేసింది. తొలి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి విమర్శకులను మెప్పించింది. నేడు అగ్రజట్టు టీమ్ ఇండియాతో పోరుకు సై అంటోంది. మరోవైపు భారత్ పసికూనతో పోరుకు సైతం పకడ్బందిగా సన్నద్ధమవుతుంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన రోహిత్ శర్మ నేడు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ఎదురుచూస్తున్నాడు. ఆతిథ్య అమెరికా అభిమానులు సహా భారత అభిమానులు ఎదురుచూస్తున్న క్రేజీ మ్యాచ్‌కు నేడు న్యూయార్క్‌లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది.
పంత్ ఒక్కడే.. : గ్రూప్-ఏలో భారత్ రెండు విజయాలు సాధించింది. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిలకడగా రాణించిన బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే. బంగ్లాదేశ్‌తో వార్మప్‌లోనూ పంత్ అర్థ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఐర్లాండ్‌పై అర్థ సెంచరీ బాదినా.. పాక్‌తో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్ల నిలకడలేమి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సైతం అంచనాలను అందుకోవటం లేదు. రిషబ్ పంత్‌కు తోడుగా రోహిత్, కోహ్లి, సూర్య మెరిస్తే అమెరికా బౌలర్లకు నేడు న్యూయార్క్‌లో పగలే చుక్కలు కనిపిస్తాయి!. లోయర్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా బ్యాట్‌తో బాధ్యత తీసుకోవాల్సి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేయటం బాగా కలిసొచ్చింది. నాకౌట్ మ్యాచుల అవసరం కోసం అక్షర్ పటేల్‌ను అవసరమైతే నేడు సైతం ముందుగానే బ్యాటింగ్‌కు పంపే అవకాశం ఉంది. జశ్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ త్రయం జోరుమీదుంది. ఇక్కడ భారత్ ఇప్పటికే మూడు మ్యాచులు (వార్మప్‌తో కలిపి) ఆడటంతో నేడు మ్యాచ్‌లో పిచ్ స్వభావం, పరిస్థితులపై మంచి అవగాహనతోనే బరిలోకి దిగనున్నారు.
అమెరికాతో జాగ్రత్త! : ఆతిథ్య అమెరికాను తేలిగ్గా తీసిపారేయడానికి ఏమాత్రం వీలులేదు. పేరుకే అమెరికా జట్టు అయినా.. ఆ బృందంలో సగానికి పైగా భారత సంతతి క్రికెటర్లే ఉన్నారు. ఆరోన్ జోన్స్, మోనాంక్ పటేల్, ఆండ్రీస్ గౌస్, నితీశ్ కుమార్, మిలింద్ కుమార్, స్టీవెన్ టేలర్‌లు ఊపుమీదున్నారు. కెనడా, పాకిస్థాన్‌లపై విజయాల్లో వీరి పాత్ర అమోఘం. నేడు భారత్‌తో మ్యాచ్‌లో మెరిసి ప్రపంచం దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు అమెరికా ప్రయత్నించనుంది. ఇక సొంతగడ్డపై ఆడుతున్న అమెరికాకు విచిత్రంగా అభిమానుల మద్దతు లభించటం కష్టమే. భారత అభిమానులో స్టేడియం నిండిపోనుండగా.. ఆతిథ్య జట్టు కాస్త వింత అనుభూతిని ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.
యశస్వికి అవకాశం ఉందా? : భారత్ తొలి రెండు మ్యాచుల్లో తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లి ఇంకా పరిస్థితులకు అలవాటు పడినట్టు అనిపించటం లేదు. సూర్యకుమార్ యాదవ్ సైతం టచ్‌లోకి రాలేదు. దీంతో టాప్ ఆర్డర్‌కు బలమైన మిడిల్ ఆర్డర్‌ను జోడించేందుకు బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేసే ఆలోచన ఉంది. యశస్వి జైస్వాల్‌ను టాప్ ఆర్డర్‌లో చేర్చేందుకు జట్టు మేనేజ్‌మెంట్ సిద్ధంగా ఉంది. పేస్ ఆల్‌రౌండర్ శివం దూబెను బెంచ్‌కు పరిమితం చేసి యశస్వి జైస్వాల్‌ను బ్యాటింగ్ లైనప్‌లో తీసుకోనున్నారు. సంజు శాంసన్ సైతం రేసులో నిలిచినా.. విరాట్ కోహ్లి ఫామ్ దృష్ట్యా జైస్వాల్‌కు మొగ్గు కనిపిస్తుంది. బౌలింగ్ విభాగంలో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జట్టుకు సమతూకం తీసుకొస్తున్నారు.
పిచ్, వాతావరణం : భారత్, అమెరికా మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు. న్యూయార్క్ నాసా కౌంటీ స్టేడియం పిచ్ మరోసారి చర్చకు రానుంది. పిచ్ పగుళ్ల నుంచి పచ్చిక మొలకెత్తటంతో అదనపు సీమ్, బౌన్స్ లభిస్తుందని క్యూరేటర్ తెలిపాడు. నేడు మ్యాచ్‌కు పాత పిచ్‌నే వాడనున్నారు. దీంతో పరుగుల వేటలో బ్యాటర్లకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.