భారత్‌కు ఎదురుందా?

facing-india-4– నేటి నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు
– ఉత్సాహంతో ఉరకలేస్తున్న బంగ్లా పులులు
– క్లీన్‌స్వీప్‌ విజయంపై కన్నేసి బరిలో మనోళ్లు
– ఉదయం 9.30 నుంచి జియో సినిమాలో..

2024 టీ20 ప్రపంచకప్‌తో ఐసీసీ టైటిల్‌ దాహం తీర్చుకున్న టీమ్‌ ఇండియా.. ఇక ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియనషిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవటంపై దృష్టి సారించనుంది. స్వదేశంలో ఐదు టెస్టులు ఆడనున్న భారత్‌ అందులో భాగంగా నేడు బంగ్లాదేశ్‌ చెపాక్‌లో సమరానికి సై అంటోంది. పాకిస్థాన్‌పై చారిత్రక టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ విజయం సాధించిన బంగ్లాదేశ్‌ అదే ఉత్సాహంలో భారత్‌ను ఢకొీట్టేందుకు సిద్ధమైంది. భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి టెస్టు చెన్నై చెపాక్‌ వేదికగా నేటి నుంచి ఆరంభం.

నవతెలంగాణ-చెన్నై :

అత్యుత్తమ బ్యాటర్లు, నాణ్యమైన పేసర్లు, ప్రపంచ శ్రేణి స్పిన్నర్లు జోరు మీద ఉండగా.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్‌ ఇండియా హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుని ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం పదిలం చేసుకునే దిశగా రోహిత్‌సేన అడుగులు వేస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత టీమ్‌ ఇండియా టెస్టు క్రికెట్‌ ఆడనుండటంతో ఇటు అభిమానుల్లో, అటు ఆటగాళ్లలో ఆసక్తి కనిపిస్తోంది. చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌కు సైతం స్వదేశంలో ఇదే తొలి సవాల్‌ కావటంతో సిరీస్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియం వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి టెస్టు నేటి నుంచి ఆరంభం కానుంది. ఉదయం 9.30 గంటలకు టెస్టు సమరం షురూ అవుతుంది. బ్యాటర్లు మెరిసేనా? స్వదేశి, విదేశీ పిచ్‌ అనే తేడా లేకుండా మనోళ్లు అప్రతిహాత ప్రదర్శన చేస్తున్నారు. కానీ స్వదేశీ పిచ్‌లపై మన బ్యాటర్లు జోరు కాస్త తగ్గింది. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ పరుగుల వేటలో వెనుకంజ వేయటమే అందుకు కారణం. ఈ ఇద్దరు స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు ఆడితే భారత్‌ భారీ స్కోరు చేయటం లాంఛనమే. యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌పై కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. రిషబ్‌ పంత్‌, కెఎల్‌ రాహుల్‌ సైతం మిడిల్‌ ఆర్డర్‌లో జత కలువనున్నారు. దీంతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ మరింత దుర్భేద్యంగా ఉండనుంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు జట్టులో ఉండనున్నారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. బౌలింగ్‌ విభాగంలో ఐదో స్థానం కోసం కుల్దీప్‌ యాదవ్‌, యశ్‌ దయాల్‌ పోటీపడుతున్నారు. పిచ్‌, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తుది జట్టు కూర్పు చేయనున్నారు. బంగ్లాతోనే జాగ్రత్త బంగ్లాదేశ్‌ పసికూన.. ఇది ఒకప్పటి మాట. బంగ్లాదేశ్‌ ఇక నుంచి అన్ని ఫార్మాట్లలోనూ బెబ్చులిగా గర్జించనుంది. ఇటీవల ఆ జట్టు ప్రదర్శనలు చూస్తే ఎవరైనా ఇది అనాల్సిందే. పాకిస్థాన్‌ను వారి గడ్డపైనే ఓడించి నయా చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ అదే ఉత్సాహంలో భారత్‌తో సమరానికి సై అంటోంది. పాకిస్థాన్‌, భారత్‌లో పరిస్థితులు, పిచ్‌ స్వభావం దాదాపుగా ఒకేలా ఉంటాయి. కానీ పాక్‌లో కోకాబురా బాల్‌ను వాడితే.. మన దగ్గర ఎస్‌జీ బాల్‌ను వినియోగిస్తారు. ఎస్‌జీ బంతి పాతబడిన తర్వాత పరుగుల వేట కష్టతరం అవుతుంది. పేసర్లు రివర్స్‌ స్వింగ్‌, స్పిన్నర్లు టర్న్‌తో రెచ్చిపోతారు. ఎస్‌జీ బంతిని ఎదుర్కొని బంగ్లాదేశ్‌ లోయర్‌ ఆర్డర్‌ విలువైన పరుగులు చేయటం కఠిన సవాల్‌. స్పిన్‌, పేస్‌ పరంగా బంగ్లాదేశ్‌ గొప్పగా కనిపిస్తోంది. నహిద్‌ రానా ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ తురుపుముక్క కానుండగా.. తైజుల్‌ ఇస్లామ్‌, టస్కిన్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ మిరాజ్‌, షకిబ్‌లు ప్రమాదకర బౌలర్లు. లిటన్‌ దాస్‌, నజ్ముల్‌ శాంటో, ముష్ఫీకర్‌ రహీమ్‌, షకిబ్‌లు బ్యాట్‌తో బంగ్లాదేశ్‌కు కీలకం. పిచ్‌, వాతావరణం అంచనాలకు భిన్నంగా చెపాక్‌ పిచ్‌ పేసర్లకు అనుకూలించనుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి టెస్టు కోసం క్యూరేటర్‌ ఎర్రమట్టితో చేసిన పిచ్‌ను సిద్ధం చేశారు. ఐదు రోజుల పాటు పేసర్లకు అనుకూలత ఉండనున్నా.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మ్యాచ్‌ సాగుతున్న కొద్ది స్పిన్నర్లకు సైతం టర్న్‌ దక్కనుంది. టాస్‌ నెగ్గిన తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌, కెఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌/యశ్‌ దయాల్‌, మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
బంగ్లాదేశ్‌ : నజ్ముల్‌ శాంటో (కెప్టెన్‌), ఇస్లాం, జేకర్‌ అలీ, ముష్ఫీకర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌ (వికెట్‌ కీపర్‌), షకిబ్‌ అల్‌ హసన్‌, మెహిది హసన్‌ మిరాజ్‌, నహిద్‌ రానా, తైజుల్‌ ఇస్లాం, టస్కిన్‌ అహ్మద్‌, నయీం హసన్‌.