సన్‌రైజర్స్‌కు ఎదురుందా?

సన్‌రైజర్స్‌కు ఎదురుందా?– నేడు గుజరాత్‌తో హైదరాబాద్‌ పోరు
అహ్మదాబాద్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఐపీఎల్‌లో ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న జట్టు. గత సీజన్‌లో పేలవ బ్యాటింగ్‌తో స్వల్ప స్కోర్లతో ఆపసోపాలు పడిన హైదరాబాద్‌.. ఈ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. తొలి రెండు మ్యాచుల్లోనూ 200 పైచిలుకు పరుగులు సాధించింది. ముంబయి ఇండియన్స్‌పై 277 పరుగులతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన రికార్డును సొంతం చేసుకుంది. ధనాధన్‌ బ్యాటింగ్‌ మంత్ర జపిస్తున్న సన్‌రైజర్స్‌ నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. తొలి రెండు మ్యాచుల్లో ఓ విజయం సాధించిన ఇరు జట్లు నేడు రెండో విజయంపై కన్నేసి బరిలోకి దిగుతున్నాయి.
ట్రావిశ్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అభిషేక్‌ శర్మ, ఎడెన్‌ మార్‌క్రామ్‌.. సన్‌రైజర్స్‌కు చారిత్రక స్కోరు అందించిన విధ్వంసక బ్యాటర్లు. చివరగా అహ్మదాబాద్‌లో ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌కు గాయం చేసే ఇన్నింగ్స్‌ ఆడిన ట్రావిశ్‌ హెడ్‌ నేడు సన్‌రైజర్స్‌ తరఫున ఆ జోరు కొనసాగించేందుకు చూస్తున్నాడు. టాప్‌ ఆర్డర్‌లో ట్రావిశ్‌ హెడ్‌ ఇన్నింగ్స్‌ హైదరాబాద్‌కు ఎక్స్‌ఫ్యాక్టర్‌గా నిలుస్తుంది. అభిషేక్‌ శర్మ కలల ఇన్నింగ్స్‌తో అందరినీ మెప్పించాడు. మయాంక్‌ అగర్వాల్‌ సైతం ఈ ధనాధన్‌ బృందంలో చేరితే హైదరాబాద్‌కు ఎదురుండదు. మార్‌క్రామ్‌, క్లాసెన్‌ జోడీగా దక్షిణాఫ్రికాకు ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇప్పుడు ఆ పని సన్‌రైజర్స్‌ తరఫున కొనసాగిస్తున్నారు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సన్‌రైజర్స్‌ రాత మార్చినట్టే కనిపిస్తున్నాడు. కఠిన సమయంలో కమిన్స్‌ ముందుండి జట్టును నడిపిస్తున్న తీరు విమర్శకుల మెప్పు పొందుతుంది. భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, షాబాజ్‌ అహ్మద్‌లు బంతితో కమిన్స్‌కు సహకరిస్తే హైదరాబాద్‌కు మరో విజయం ఖాయమే.