– గోల్డెన్ ఈగల్స్‌తో నేడు సెమీఫైనల్
– ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ 2023
జైపూర్ : ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తుది అంకానికి చేరుకుంది. ఆరు జట్లు పోటీపడిన అరంగ్రేట సీజన్ గ్రూపు దశ మ్యాచులు గురువారంతో ముగియగా.. నేడు సెమీఫైనల్స్‌తో అంతిమ ఘట్టానికి తెర లేవనుంది. గ్రూప్ దశలో ఏడు విజయాలతో తెలుగు టాలన్స్, మహారాష్ట్ర ఐరన్‌మెన్ అగ్రస్థానాల్లో నిలువగా.. రాజస్థాన్ పేట్రియాట్స్, గోల్డెన్ ఈగల్స్ యూపీ టాప్-4లో నిలిచి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. నేడు తొలి సెమీఫైనల్లో రాజస్థాన్ పేట్రియాట్స్‌తో మహారాష్ట్ర ఐరన్‌మెన్ తలపడనుంది. గ్రూప్ దశలో ఐరన్‌మెన్‌పై గెలుపొందిన జట్లలో రాజస్థాన్ పేట్రియాట్స్ ఒకటి. ఇక రెండో సెమీఫైనల్లో తెలుగు టాలన్స్‌తో గోల్డెన్ ఈగల్స్ ఉతర్తప్రదేశ్ తలపడనుంది. రాత్రి 7 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో మ్యాచులు ప్రసారం.
ఇక తెలుగు టాలన్స్ నేడు సెమీఫైనల్లో హాట్‌ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. గోల్డెన్ ఈగల్స్ యూపీతో గ్రూప్ దశలో రెండు మ్యాచుల్లోనూ విజయాలు సాధించిన టాలన్స్ నేడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. నసీబ్ సింగ్ (72), కైలాష్ పటేల్ (53), దేవిందర్ సింగ్ భుల్లార్ (52) అర్థ సెంచరీ గోల్స్‌తో తెలుగు టాలన్స్‌ను ముందుండి నడిపిస్తున్నారు. తెలుగు టాలన్స్ గోల్ కీపర్ రాహుల్ 150కి పైగా సేవ్‌లతో లీగ్‌లోనే విజయవంతమైన గోల్‌కీపర్‌గా కొనసాగుతున్నాడు. ఒత్తిడిలో రెట్టింపు ఉత్సాహంతో చెలరేగటం తెలుగు టాలన్స్ అదనపు బలం. గ్రూప్ దశలో ఎన్నో మ్యాచుల్లో వెనుకంజలో నిలిచినా.. వరుస గోల్స్ నమోదు చేసి ఆధిక్యమే కాదు విజయాలు నమోదు చేసింది. తెలుగు టాలన్స్‌ను నేడు సెమీఫైనల్లో గోల్డెన్ ఈగల్స్ యూపీ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.