– అధికారంలోకి వచ్చేందుకే అమలు హామీలిచ్చిన కాంగ్రెస్
– మహాలక్ష్మి, గృహజ్యోతికే రూ.47,400 కోట్లు అవసరం
– మిగతా గ్యారంటీల అమలు సంగతేంటి? : మధుసూదనాచారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వాస్తవాలను వక్రీకరించి బడ్జెట్‌ను, గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని బీఆర్‌ఎస్ సభ్యుడు మధుసూదనాచారి విమర్శించారు. పదేండ్లలో అభివృద్ధి జరగనట్టు, అంతా అవినీతి జరిగినట్టు బీఆర్‌ఎస్‌పై నిందారోపణలు చేశారని అన్నారు. బుధవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని తక్కువ చేయడం, జాతీయ నాయకులే దయతో రాష్ట్రాన్ని ఇచ్చినట్టు చెప్పడం సరైంది కాదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు అమలు కాని హామీలను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో పింఛనుదారులను తీసేస్తే 1.39 కోట్ల మంది మహిళలున్నారని చెప్పారు. వారికి నెలకు రూ.2,500 ఇవ్వాలంటే ఏడాదికి రూ.41,700 కోట్లు కావాలన్నారు. 70 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లున్నాయని వివరించారు. వారి కోసం ఏటా రూ.2,100 కోట్లు అవసరమని సూచించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుకు నెలకు రూ.మూడు వేల కోట్లు, ఏడాదికి రూ.3,600 కోట్లు కావాలని అన్నారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచిం చారు. నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లోనూ ఇది సాధ్యం కాలేదన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడతా మంటే ఎలా కుదురుతుందన్నారు. ఈ సమయంలో మంత్రి సీతక్క కల్పించుకుని 2019 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని బీఆర్‌ఎస్ హామీ ఇచ్చిందనీ, ఐదేండ్లలో దాన్ని అమలు చేయలేదని చెప్పారు. ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. అప్పుడే ఆటో కార్మికుల గురించి ప్రస్తావించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. నిరుద్యోగులను ఏమైనా చేస్తారా?అని అనడం సరైంది కాదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పట్ల తాము అభ్యంతరం చెప్పలేదని ఈ సందర్భంగా మధుసూదనాచారి చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్పించుకుని రాష్ట్రంలో పాపాలు, కష్టాలు, బాధలకు గత ప్రభుత్వమే కారణమని అన్నారు. ప్రజలకు ఇన్ని కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చాయా?అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చి 65 రోజులు గడిచాయని మధుసూదనాచారి చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుకు ఇంకా 35 రోజులే ఉన్నాయని వివరించారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో 4.15 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామన్నారని గుర్తు చేశారు. దానికోసం రూ.7,740 కోట్లు కేటాయించారని చెప్పారు. ఆ నిధులతో సగం ఇండ్లు మంజూరవుతాయని అన్నారు. అంబేద్కర్ అభయహస్తం కింద ఎస్సీ,ఎస్టీలకు రూ.12 లక్షలు ఇస్తామన్నారని వివరించారు. వారి సంఖ్య ఎంత, నిధుల కేటాయింపు ఎంత చెప్పాలన్నారు. మండలానికో అంతర్జాతీయ పాఠశాల అన్నారనీ, పైలెట్ ప్రాజెక్టు కింద రూ.500 కోట్లు కేటాయించారని చెప్పారు. తనకు తెలిసిన ఓ మిత్రుడు అంతర్జాతీయ పాఠశాల నిర్మిస్తే భూమి కాకుండా నిర్మాణం, వసతులకు రూ.30 కోట్లు ఖర్చయ్యాయని వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందంటూ విమర్శిస్తున్నారనీ, అయితే అప్పులు చేయని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయా?అని ప్రశ్నించారు. అప్పు చేయబోమంటూ కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా?అని అడిగారు. పరిపాలన అంటే ఎదుటివారిపై బురదజల్లడం కాదన్నారు. తప్పులుంటే సరిదిద్దాలని సూచించారు.