అవినీతిరహిత పాలన అందించడంలో విఫలం

 Corruption free governance Fail to deliver– అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌, విద్య, వైద్యం
– ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు : ఆప్‌ దక్షిణ భారత ఇన్‌ఛార్జి సోమనాథ్‌ భారతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలకు అవినీతిరహత పాలన అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ దక్షిణ భారత ఇన్‌ఛార్జీ సోమనాథ్‌ భారతి విమర్శించారు. ఆప్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో సామాన్యుడి సమరభేరీ పేరుతో నిర్వహించి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌, విద్య, వైద్యమందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేస్తామని తెలిపారు. బీజేపీ బెదిరింపులకు ఆప్‌ నేతలు లొంగరనీ, వారు సామాన్యులు ఎన్నుకున్న బలమైన నేతలని చెప్పారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భగత్‌ సింగ్‌, దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌లను ఆప్‌ అనుసరిస్తున్నదని స్పష్టం చేశారు. బీజేపీ హిందూ వ్యతిరేక కార్పొరేట్‌ అనుకూల పార్టీ అని విమర్శించారు. బీజేపీ నకిలీ హిందుత్వవాదం, నకిలీ జాతీయవాదంతో ఎక్కువ కాలం పాలించలేదని హెచ్చరించారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పాలనా నమూనాలో భాగమైన మెరుగైన పాఠశాలలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, ఉచిత విద్యుత్‌ యూనిట్లు, మెరుగైన రోడ్లు, మహిళల సాధికారత, రైతులకు సబ్సిడీలు వంటి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్శిస్తున్నాయని చెప్పారు. ‘వన్‌ నేషన్‌’, ‘వన్‌ ఎడ్యుకేషన్‌’, ‘వన్‌ హెల్త్‌ కేర్‌’ వంటి ఆప్‌ ఎజెండాను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఆప్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆప్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. మార్పు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు ఆప్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు భూక్యా అధ్యక్షత వహించారు. అధికార ప్రతినిధి వినరు రెడ్డి, రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్‌, ఏం.ఏ. మజీద్‌, డాక్టర్‌ సోలొమన్‌ రాజ్‌, డాక్టర్‌ హరి చరణ్‌, డాక్టర్‌ అన్సారీ, డాక్టర్‌ పుట్ట పాండురంగయ్య, బాబుల్‌ రెడ్డి, తిరుమల రావు, ఆప్‌ మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమ జిల్లోజు, యమునా గౌడ్‌తో పాటు జిల్లా, మండల, గ్రామాల కన్వీనర్లు, అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, వాలంటీర్లు పాల్గొన్నారు.