
నవతెలంగాణ -ముధోల్
ప్రసిద్ధిగాంచిన బాసర పుణ్యక్షేత్రంలో ఏర్పాటుచేసిన ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు సక్రమంగా రాసిన పరీక్షలో ఫెయిల్ చేసిన ఘటన బాసర ట్రిపుల్ ఐటీ లో చోటుచేసుకుంది. విద్యార్థులను కావాలనే ఫేయిల్ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో విధ్యార్థులు ఆగష్టు, సెప్టెంబర్ నెలలో పరీక్షలు రాశారు. పరీక్ష ఫలితాలను ఇటివల వెల్లడించారు. అయితే కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి. దీంతో అనుమానం వ్యక్తం చేసిన కొంతమంది విద్యార్థులు యూనివర్సిటీ కార్యాలయానికి వెళ్లి తమ పరీక్ష పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలని పట్టుబట్టారు. దీంతో రివల్యూషన్ లో కొంతమంది విద్యార్థులు పాస్ అయ్యారు. దీంతో విద్యార్థులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. తాము కష్టపడి చదివి పరీక్షలు బాగా రాసినప్పటికీ ట్రిపుల్ ఐటీ అధికారులు కావాలని తమ జీవితాలతో ఆడుకుంటున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు.
ట్రిపుల్ ఐటీ లో ఉన్న తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ విద్యార్థి సంఘం నాయకులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎగ్జామినేషన్ అధికారి నిర్లక్ష్య వైఖరిని ఈ సందర్భంగా విద్యార్థులు ఎండగట్టారు. గత కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న ట్రీపుల్ ఐటి లో మళ్లీ విద్యార్థులు ఆందోళన చేయటం చర్చకు దారి తీసింది. పరీక్ష ఫలితాలు తారుమారు అయ్యాయని దీంతో ఈ ఘటన చోటు చేసుకుందని ట్రిపుల్ ఐటీ అధికారులు అంటున్నారని విధ్యార్థులు పేర్కొంటున్నారు. విద్యార్థులను కావాలని ఫేయిల్ చేశారా, అనుకోకుండా మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయ అన్న విషయలు తెలియాల్సింఉంది . ఎప్పుడు ట్రిపుల్ ఐటీ లో ఏదో ఒక ఘటన జరిగి వార్తలో నిలవటం జరుగుతున్న పారదర్శకంగా వ్యవహరించాల్సిన ట్రిపుల్ ఐటీ అధికారులు నిర్లక్ష్య వైఖరి పై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రీపుల్ ఐటీ అధికారుల వైఖరి పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.