హాజరు పెంచకుంటే గుర్తింపు రద్దే

హాజరు పెంచకుంటే గుర్తింపు రద్దే– పరీక్షా పే చర్చ పై పాఠశాలలకు సీబీఎస్‌ఈ తాఖీదులు
భువనేశ్వర్‌ : ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ప్రారంభించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలల్లో కొన్నింటికి సూచించింది. లేకుంటే గుర్తింపును రద్దు చేస్తానని హెచ్చరించింది. ప్రస్తుత సంవత్సర పు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి జనవరి 29న రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు చేపట్టిన ఈ కార్యక్రమం కోసం 2.26 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరం ఈ సంఖ్య 38 లక్షలు మాత్రమే.
భువనేశ్వర్‌లోని సీబీఎస్‌ఈ ప్రాంతీయ కార్యాలయం ఒడిషాలోని పలు పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు జనవరి మొదటి వారంలో ఈ-మెయిల్‌ సందేశాలు పంపింది. ప్రధాని కార్యక్రమానికి పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. భువనేశ్వర్‌లోని సీబీఎస్‌ఈ అండర్‌ సెక్రటరీ లలిత్‌ కుమార్‌ హిమాన్షు ఈ సందేశాలు పంపారు. హాజరు పెంచకపోతే గుర్తింపు పొడిగింపులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పరీక్షా పే చర్చ అనేది వార్షిక కార్యక్రమం. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యా యుల సమక్షంలో పాఠశాల ఆడిటోరి యంలో దీనిని నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని పలు టీవీ ఛానల్స్‌ కూడా ప్రసారం చేస్తాయి. కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకునే వారు ముందుగా ఓ పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉండేలా సంబంధిత పాఠశాలలే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
‘పరీక్షా పే చర్చ-2024 కోసం మీ పాఠశాల నుండి రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయి. సీబీఎస్‌ఈ కేంద్ర కార్యాలయం ఈ నమోదు ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది. మీ పాఠశాల నుండి రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నందున గుర్తింపు పొడిగింపులో, దానికి సంబంది óంచిన ఇతర పనుల్లో సమస్యలు ఎదురు కావచ్చు’ అని ప్రిన్సిపాల్స్‌కు రాసిన లేఖల్లో హిమాన్షు తెలిపారు. ‘మీ పాఠశాల నుండి గరిష్ట స్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేసుకునేలా చూడండి. అంతా అయిపోయిన తర్వాత వివరణలు ఇచ్చుకోవడం, సమస్యలు కొనితెచ్చు కోవడం కంటే పనిని పూర్తి చేయడం మంచిది’ అని సుద్దులు చెప్పారు.