న్యాయమైన కోరికలు

న్యాయమైన కోరికలుభార్య నుండి భర్త, భర్త నుండి భార్య ప్రేమా, అప్యాయతలు కోరుకోవడం చాలా సహజం. వారి మధ్య బంధం ఏర్పడి ఎన్నేండ్లయినా సరే ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం చాలా అవసరం. అప్పుడే వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. అయితే కొన్ని సార్లు ఇంత చిన్న కోరికల కోసం వీరు ఈ వయసులో గొడవ పడుతున్నారా? అనిపిస్తుంది. కానీ ఆ చిన్న కోర్కెలే తీరనపుడు మనసు ఆవేదన చెందుతుంది. జీవితం విరక్తిగా అనిపిస్తుంది. ఇలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదవండీ…
అంజలికి 42 ఏండ్లు ఉంటాయి. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు పెండ్లయి ఇరవై ఏండ్లు దాటింది. ఆమెకూ తన భర్త వంశీకి మధ్య 12 ఏండ్ల తేడా వుంది. పెద్దలు కుదిర్చిన వివాహం. వాళ్ళకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వాళ్ళు డిగ్రీ చేస్తున్నారు. అంజలి ఎప్పుడూ జాలీగా, సరదాగా ఉండాలి అనుకుంటుంది. జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. కనుక చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం వెదుక్కోవాలి అనుకుంటుంది. కానీ వంశీ అలా కాదు. సరదాగా మాట్లాడడం రాదు. అంతెందుకు రోజు మొత్తంలో కనీసం ఆమెతో ఐదు నిమిషాలు కూడా సరిగ్గా మాట్లాడడు. ఇంట్లో ఉన్న రోజుల్లో కూడా టీవీ చూస్తూనో, ఫోన్‌ చూస్తూనో గడిపేస్తాడు. అంతే తప్ప అంజలి కోసం సమయం కేటాయించడు.
తను ఎటూ మాట్లాడడు కాబట్టి అంజలినే చొరవ తీసుకొని మాట్లాడించడానికి ప్రయత్నించినా విసుక్కుంటాడు. ఇలా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ లేకపోతే ఎలా అనేది అంజలి ఆవేదన. పెండ్లయిన కొత్తలో అయితే అంతా కొత్త కాబట్టి మాట్లాడటానికి ఇబ్బంది అనుకోవచ్చు. కానీ వీరి పెండ్లయి చాలా ఏండ్లు గడుస్తోంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. అసలు వంశీ ఆలోచనలు ఏమిటో ఆమెకు అర్థం కావడం లేదు.
అతనికి జీతం ఎంత వస్తుంది, ఏమైనా అప్పులు ఉన్నాయా? ఏమైనా పొదుపు చేస్తున్నాడా? ఇవేవీ ఆమెకు తెలీదు. సరదాగా ఎక్కడికైనా బయటకు వెళదామన్నా రాడు. ఇంట్లో పెద్దవాళ్ళు, పక్కన బంధువులు ఉన్నారు. దాంతో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలా బయటకు వెళ్లినపుడో, పండగలకు, ఫంక్షన్లకు అందరూ కలిసినపుడైనా మాట్లాడతాడా అంటే అప్పుడు కూడా చాలా సీరియస్‌గా ఉంటాడు. ఏదైనా సమస్య ఉంటే అదైనా చెప్తాడా అంటే అదీ లేదు. ఎప్పుడైనా ఆమె పలకరించడానికి ప్రయత్నిస్తే కసురుకోవడం, తిట్టడం తప్ప అతని నోటి నుండి వేరే మాటలు ఏమీ రావు. ఎప్పుడైనా మెసేజ్‌ పెట్టినా రిప్లరు ఇవ్వడు. ఫోన్‌ చేస్తే ‘ఇంటికి వస్తున్నా’ అని వెంటనే కట్‌ చేసేస్తాడు. అలాంటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలే తెలియక అంజలీ తనలో తానే మదనపడుతోంది. ఒకవేళ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్‌ గ్యాప్‌ వల్ల పరిస్థితి ఇలా ఉందా అనే అనుమానం కూడా వచ్చింది. కనీసం పిల్లల భవిష్యత్‌ గురించి అయినా మాట్లాడుకోవాలి కదా అని ఆమె దిగులు. ఎలాగైనా తన భర్తతో మాట్లాడి అసలు తన సమస్య ఏంటో తెలిసుకోమంటూ మా దగ్గరకు వచ్చి ప్రాధేయపడింది.
మేము వెంటనే వంశీని పిలిపించి మాట్లాడితే ‘టైం ఎవ్వడం అంటే ఏమిటీ? ఒకరిని ఒకరు చూసుకోవడమేనా? ఇదేమీ సినిమా కాదు కదా! జీవితం సినిమాల్లో చూపించినట్టు ఉంటుందా? ఆమెకు ఏదైనా అవసరం ఉంటే చెప్పమనండి, వెంటనే తెచ్చిపెడతాను. తాను ఎక్కడికైనా వెళతానంటే నేను ఎప్పుడూ ఎందుకు అని ప్రశ్నించలేదు, అడ్డుచెప్పలేదు. అదే వేరే వాళ్ళయితే ఇలా ఒప్పుకుంటారా? తనని ఎప్పుడూ నేను ఇబ్బంది పెట్టలేదు. మా ఇంట్లో మాతోపాటు మా అమ్మ కూడా ఉంటుంది. చుట్టుపక్కల బంధువులు ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా మా ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉంటారు. అందరి ముందు నేను అంజలితో ఏం మాట్లాడాలి? నాకు ఇది కావాలి అని అడక్క ముందే ఆమె నాకు అన్నీ చేసి పెడుతుంది. ఉదయం నేను స్నానం చేసి వచ్చేలోపు టిఫిన్‌ చేసి పెడుతుంది. ఇక నాకు ఆమెను పిలవడానికి అవకాశం ఎక్కడుంది. మా ఇంట్లో వారి ఆలోచనలు పాతకాలంలా ఉంటాయి. నేను తనతో కలిసి టీవీ చూసినా మా బంధువులు ఎగతాళి చేస్తారు. వారు చేయకపోయినా పిల్లలు ఎప్పుడు మా ఇంట్లోనే వుంటారు. వాళ్లు ఎప్పుడూ మేము ఏం చేస్తున్నామో గమనిస్తుంటారు. కాబట్టి నేను అంజలితో మాట్లాడడం చాలా తక్కువ. మేము బయటకు వెళ్ళినపుడు మాత్రం మాట్లాడుకుంటాం. కానీ మేము ఇద్దరం కలిసి బయటకు వెళ్ళటం చాలా తక్కువ. నాకు ఇంట్లో ఉంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం కారణంగా అంజలితో సరదాగా ఉండలేను. కానీ నాకు కూడా ఆమెతో సరదాగా మాట్లాడాలని ఉంటుంది. బయటకు చెబితే తను ఎలా ఫీల్‌ అవుతుందో అని చెప్పలేదు’ అని అన్నాడు.
‘అంజలి మీతో తన మనసులో విషయాలు చెప్పాలనుకుంటుంది. పిల్లల చదువు, భవిష్యత్‌ గురించి మాట్లాడాలనుకుంటుంది. ఇదేం తప్పు కాదుకదా? అంజలివి చిన్న చిన్న కోరికలే. ఆమె కోసం కాస్త సమయం కేటాయిస్తే సరిపోతుంది. వాళ్లేమనుకుంటారో, వీళ్లేమనుకుంటారో అని మీ భార్యను దూరం పెడుతున్నారు. ఇంటి పనిలో తనకు సహాయం చేయండి. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ఇక పోతే మీ బంధువులు, వారి పిల్లలు గమనిస్తారు అంటున్నారు. భార్యాభర్తలంటే ఎంత అన్యోన్యంగా కలిసి మాట్లాడుకోవాలో, పనులు చేసుకోవాలో మిమ్మల్ని చూసి వాళ్లు నేర్చుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. పిల్లలకు అన్నీ నేర్పించాల్సింది తల్లిదండ్రులే. ఇప్పటికైతే మీరు అంజలికి కాస్త సమయం కేటాయించండి. అన్ని విషయాలు ఆమెతో చర్చించండి. ఆమె అభిప్రాయాలు కూడా తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్‌ వారి చదువు, పెండ్లి వంటి విషయాల్లో మీరిద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయమే వారి భవిష్యత్‌కు బంగారు బాట వేస్తుంది” అని చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి,
9948794051