
నవతెలంగాణ- గోవిందరావుపేట
మేడారం జాతర సందర్భంగా వచ్చే వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా రహదారుల నిర్మాణం ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి సంస్థ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం మండలంలోని గుండ్ల వాగు రహదారి ప్రాంతంలోని వంతెన దెబ్బతిన్న ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం సీతక్క అధికారులతో మాట్లాడుతూ జరుగుతున్న తాత్కాలిక మరమ్మత్తులే కాకుండా శాశ్వత ప్రమాదాలకు తావులేని నిర్మాణాలు జరగాలని అన్నారు. అందుకొరకు సంబంధిత శాఖల అధికారులు ఒకరికొకరు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత ప్రాంతంలో అనేక విషయాలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి తో చర్చించి పలు సలహాలు సూచనలు చేశారు. రహదారుల వెంట వాహనాల ప్రయాణికులకు ఎలాంటి అవరోధాలు కలవకుండా చూడాలని అన్నారు. జాతర సమయంలో జాతీయ రహదారి విషయం లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. మంత్రి తో, జిల్లా ఎస్పీ శభరిష్ , ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) శ్రీజ ఇతర అధికారులు పాల్గొన్నారు.