కామారెడ్డి జిల్లాలో నకిలీ వైద్యుడి అరెస్ట్‌

– కామారెడ్డి ఐఎంఎ వైద్యుల ఫిర్యాదు మేరకు టీజీఎంసీ విచారణ
– పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కామారెడ్డి పట్టణంలో గత కొన్ని నెలలుగా ముల్కల రవీందర్‌ అనే నకిలీ వైద్యుడు న్యూ స్టార్‌ హాస్పిటల్‌లో జనరల్‌ ఫిజిషియన్‌ అని చెప్పుకుని ఎల్‌.రవీందర్‌ రెడ్డి పేరుతో నకిలీ సర్టిఫికెట్‌ సృష్టించి డాక్టరుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను రాసే ప్రెస్క్రిప్షన్స్‌పై అనుమానం వచ్చిన కామారెడ్డి ఐఎంఎ కార్యదర్శి డాక్టర్‌ అరవింద్‌ గౌడ్‌, డాక్టర్‌ గీరెడ్డి రవీందర్‌ రెడ్డిలు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. మెడికల్‌ కౌన్సిల్‌లో పేరు సరిపోలింది కానీ అసలు ఎల్‌. రవీందర్‌ రెడ్డి ఎండి పిడియాట్రిక్స్‌ చదివినట్టుగా ఉండడంతో పాటు ఫోటో కూడా సరిపోలినట్టు లేకపోవడంతో నకిలీ వైద్యునిగా నిర్ధారించారు.సదరు నకిలీ వైద్యునిపై కామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో రిజిస్ట్రార్‌ లాలయ్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ముల్కల రవీందర్‌ని వెతికి పట్టుకొని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు. నిందుతుడు రవీందర్‌ని నకిలీ వైద్యుడిగా నిర్ధారణ చేయడం, వెతికి పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించిన డాక్టర్‌ అరవింద్‌ గౌడ్‌, ఇతర వైద్యులను తెలంగాణ వైద్య మండలి చైర్మెన్‌ డాక్టర్‌ కె.మహేష్‌ కుమార్‌ ప్రశంసించారు. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ లేకుండా ఆలోపతి వైద్యం చేసే అర్హత ఎవరికి లేదనీ, ఆర్‌ఎంపీ, పీఎంపీ అని బోర్డులు పెట్టుకునే వారు అసలు వైద్యులు కారని టీజీఎంసీ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఏ డాక్టర్‌ పైన కాని అనుమానం వస్తే నకిలీ వైద్యులా? లేక నిజమైన వైద్యులా అని https://regonlinetsmc.in/doctorsearch ద్వారా నిర్ధారణ చేసుకోవాలని ప్రజలకు సూచించారు.