పోచంపల్లిలో నకిలీ ఇక్కత్‌ చీరలు

పోచంపల్లిలో నకిలీ ఇక్కత్‌ చీరలు– చేనేత షోరూంలలో విజిలెన్స్‌ దాడులు
– నకిలీ ఇక్కత్‌ వస్త్రాలు అమ్మితే కఠిన చర్యలు : డిప్యూటీ డైరెక్టర్‌ స్టేట్‌ లెవెల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎం. వెంకటేశం
నవతెలంగాణ-భూదాన్‌ పోచంపల్లి
చేనేత వస్త్రాలకు, ఇక్కత్‌ చీరలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భూదాన్‌ పోచంపల్లిలో నకిలీ ఇక్కత్‌ చీరలు అమ్ముతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం చేనేత షోరూంలలో సోదాలు చేశారు. కొంతమంది వస్త్ర వ్యాపారులు అసలు స్థానంలో.. నకిలీ ఇక్కత్‌ వస్త్రాలను విక్రయిస్తూ పోచంపల్లి ఇక్కత్‌ చేనేతకు చెడ్డపేరు తెస్తున్నారంటూ ట్రేడ్‌ అసోసియేషన్‌ చేసిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో యాదాద్రి జిల్లా సహాయ సంచాలకులు విద్యాసాగర్‌, ఏడి జయరాజ్‌, డివోలు ప్రసాద్‌, ప్రవీణ్‌, సంధ్య, ఏడిఓలు అనిల్‌, సాయి, షకీల్‌ ఉన్నారు. 28 షాపులను సీజ్‌ చేసినట్టు తెలిపారు. చేనేతలోని ప్రింటెడ్‌ మరమగ్గాలపై తయారు చేస్తున్న చేనేత వస్త్రాలను స్వాధీన పరుచుకుని 12 షాపుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. చేనేత పరిరక్షణ చట్టం సెక్షన్‌ 6 ప్రకారం నోటీసులు జారీ చేశామని వెంకటేశం తెలిపారు. చేనేత షోరూంలలో తనిఖీ చేసే సమయంలో కొంతమంది వ్యాపారులు నకిలీ వస్త్రాలను విక్రయిస్తున్నట్టు తేలిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు చేనేత వస్త్రాలు కొనుగోలు చేసే ముందు హ్యాండ్లూమ్‌ ఇక్కత్‌ మార్క్‌, చేనేత సిల్క్‌ మార్క్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ బ్రాండ్‌ కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించారు.