రూ.10 లక్షలు విలువ చేసే నకిలీ మద్యం పట్టివేత

– ఇంట్లోనే తయారు చేస్తూ..వైన్స్‌లకు విక్రయిస్తున్న ఘనుడు
– వైన్స్‌ల్లో తనిఖీలు చేయగా..అసలు విషయం వెలుగులోకి
– నిందితుల అరెస్టు
నవతెలంగాణ-నర్సాపూర్‌, ములుగు
రూ.10 లక్షలు విలువచేసే నకిలీ మద్యాన్ని, ఆ మద్యాన్ని తయారు చేసే పరికరాలను ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. తొలుత పలు వైన్స్‌ల్లో తనిఖీలు చేయగా నకిలీ మద్యం పట్టుబడింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లోనే పరికరాలు అమర్చుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్న నిందితుడు పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ హరికిషన్‌ విలేకరులకు వెల్లడించారు.సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన పురుషోత్తం కొన్నేండ్లుగా మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని కాళ్లకల్‌లోని ఓ వైన్స్‌లో పని చేస్తున్నాడు. పని చేస్తే డబ్బులు తక్కువగా వస్తున్నాయని.. అదే నకిలీ మద్యం తయారు చేసి అమ్మితే అధిక డబ్బులు సంపాదించుకోవచ్చనుకున్న అతను.. అనుకున్నదే తడువుగా కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రణాళిక వేశాడు. ఇంట్లోనే మద్యాన్ని తయారు చేసే మిషన్లను, మద్యం సీసాలను, వాటి తయారీకి మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా బయట నుంచి తాళం వేసి లోపలే మద్యం తయారు చేసి.. అర్ధరాత్రి తర్వాత కొన్ని వైన్స్‌లకు సప్లరు చేస్తుండేవాడు. అయితే నర్సాపూర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని వైన్సుల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో.. డీటీఎఫ్‌ సీఐ నరేందర్‌, నర్సాపూర్‌ ఎక్సైజ్‌ సీఐ పద్మ ఆధ్వర్యంలో మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్‌ వైన్స్‌లను తనిఖీ చేశారు. . ఈ దాడిలో 590 ఐబీ బాటిళ్ళు, 981 ఆఫీసర్‌ ఛాయిస్‌ బాటిళ్లు, 1172 లేబుల్స్‌, ఐబీకి సంబంధించిన ఖాళీ లేబుల్స్‌ 1172, డక్కన్‌ బ్లూ 3972, ఆఫీసర్‌ ఛాయిస్‌ 806, ఐబీ క్యాప్స్‌ 97, డూప్లికేట్‌ హిల్స్‌ షీట్స్‌ 2950తో పాటు సుమారు 9000 ఖాళీ మద్యం సీసాలు దొరికాయి. పట్టుబడిన మద్యం బాటిళ్లు, పరికరాలను సీజ్‌ చేసినట్టు హరికిషన్‌ తెలిపారు.