– సుమారు రూ.500 తగ్గుదల
– నిరాశలో రైతాంగం
– దాదాపు రూ.50 లక్షల నష్టం
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి ధర పడి పోయింది.. ఈసారి పెట్టుబడి పెరిగింది.. దిగుబడులు తగ్గాయి.. కానీ మార్కెట్లో మాత్రం ఏరోజుకారోజు ధర తగ్గుతోంది. దీంట్లో వ్యాపారుల మాయాజాలంపై రైతులు ఆందోళన చెందుతు న్నారు. మార్కెట్‌కు సరుకు తక్కువగా వచ్చినా ధర మాత్రం తగ్గిస్తున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో గురువారం మిర్చి ధర రూ.500 తగ్గింది. బుధవారం మార్కెట్‌లో తేజ రకం మిర్చి ధర క్వింటాల్‌కు రూ.20,200 వుండగా, గురువారం ధర రూ.200 తగ్గి రూ.20 వేలు మాత్రమే ధర నిర్ణయించడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తేజ రకం మిర్చికి అత్యధికంగా రూ.20 వేల ధరను నిర్ణయించారు. ఎక్కువ సరుకును రూ.18 వేలకే కొనుగోలు చేశారు. బుధవారం ఎక్కువ సరుకును రూ.18,500 కొనుగోలు చేయగా, గురువారం రూ.500 తగ్గించారు. దీంతో రైతులు రూ.50 లక్షల మేరకు నష్టపోయారు. ఈసారి గతంలో కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినా, ధర తగ్గడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ‘నవతెలంగాణ’తో వాపోయారు. గత ఏడాది డిసెంబర్ మాసాంతం నుంచి ప్రారంభమైన మిర్చి రాబడులు జనవరి మాసాంతానికి చేరుకునే సరికి పెరిగాయి. ఏప్రిల్ మాసాంతం వరకు మిర్చి రాబడులు మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో వస్తూనే వుంటుంది.
వ్యాపారుల మాయాజాలం..
మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బుధవారం 10 వేల 904 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. ఈ క్రమంలో తేజ రకం మిర్చి ధర అత్యధికంగా రూ.20 వేల 200, అత్యల్పంగా రూ.14 వేల 500, ఎక్కువ సరుకును రూ.18 వేల 500 ధరతో కొనుగోలు చేశారు. వండర్‌హాట్ రకం మిర్చి రూ.19 వేలు-రూ.15 వేలు, అత్యధికంగా రూ.17 వేల 500 కొనుగోలు చేశారు. యుఎస్-341 రకం మిర్చి ధర రూ.16 వేల 800-రూ.13 వేల 500, అత్యధికంగా 15 వేలకు కొనుగోలు చేశారు. ఒక్కరోజుకే అంటే గురువారం మార్కెట్‌కు కేవలం 8 వేల క్వింటాళ్ల మిర్చి మాత్రమే వచ్చింది. గురువారం మార్కెట్‌లో తేజ రకం మిర్చి ధర క్వింటాల్‌కు అత్యధికంగా రూ.20 వేలు, అత్యల్పంగా రూ.14 వేలు, ఎక్కువ సరుకును రూ.18 వేల ధరతో కొనుగోలు చేశారు. వండర్‌హాట్ రూ.20 వేలు-రూ.14 వేలు, ఎక్కువ సరుకును రూ.18 వేలకే కొన్నారు. యుఎస్-341 రకం మిర్చి రూ.16 వేల 500-రూ.13 వేలు, అధికంగా సరుకును రూ.15 వేలకే కొనుగోలు చేశారు. కేవలం ఒక్కరోజులోనే సుమారు 2 వేల పైచిలుకు క్వింటాళ్ల మిర్చి రాబడులు తగ్గినా, ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి ధర పెరుగకపోగా, తగ్గించడం మార్కెట్‌లో వ్యాపారుల సిండికేట్ కుమ్మక్కై వ్యవహరిస్తున్న తీరుకు నిలువెత్తు నిదర్శనం.
రాబడులు తగ్గినా.. ధరలు పెరగకపాయే..
ఎనుమాముల మార్కెట్‌లో బుధవారం కంటే గురువారం మిర్చి రాబడులు తక్కువచ్చా యి. బుధవారం మార్కెట్‌కు 10 వేల 904 క్వింటా ళ్ల మిర్చి రాగా, గురువారం 8 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఒక్కరోజు తేడాతో 2 వేల పైచిలుకు క్వింటాళ్ల మిర్చి రాబడులు తగ్గినా వ్యాపారులు ధరను మాత్రం పెంచకపోవడం గమనార్హం. ఆర్థిక శాస్త్రం మూల సూత్రాన్ని మార్కెట్‌లో వ్యాపారులు నొక్కి చెబు తూనే వారి మార్క్‌లోనే ధరలను నియంత్రి స్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.