తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్నట్టుంది కేంద్ర సర్కార్ తీరు. గత 10 ఏండ్లుగా ఫ్రీ మార్కెట్ పేరుతో స్టాక్ మార్కెట్లకు అనుకూలంగా ప్రచారం ప్రారంభించింది. బ్యాంకింగ్ రంగ సంక్షోభానికి ఇది దారితీసింది. మొన్న బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలు చాలా స్మార్ట్‌గా తయారయ్యారని, తమ సేవింగ్స్‌ను స్టాక్ మార్కెట్లకు, రియల్ ఎస్టేట్‌కు మళ్లిస్తున్నారని అన్నారు. వారికి లాభం చేకూరేలా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇండెక్సేషన్ పునరుద్ధరిస్తున్నా మని అన్నారు. అదే నేడు బ్యాంకులకు ఉరితాడయ్యింది. ఇదంతా దాచి ‘బండికి రెండు చక్రాలు ఎలాగో బ్యాంకింగ్ రంగానికి డిపాజిట్లు, రుణాలు కూడా అటువంటివే. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంకింగ్ రంగం సజావుగా సాగాలంటే డిపాజిట్లు, రుణాల నడక కూడా సక్రమంగా ఉండాలి’ అంటూ కొద్ది రోజుల క్రితం రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ సుద్దులు వల్లిస్తున్నారు. బ్యాంకింగ్ రంగం డిపాజిట్ల సంక్షోభం ఎదుర్కుంటోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో జరిగిన రిజర్వుబ్యాంకు బోర్డు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డిపాజిట్లకు, రుణాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని, డిపాజిట్లుగా వచ్చిన నిధులను అవసరమైన వారికి రుణాలుగా ఇవ్వాలని ఉచిత సలహా పడేశారు. ఈ సమావేశానికి హాజరైన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిపాజిట్ల సేకరణ కోసం ఆకర్షణీయమైన, వినూత్న పథకాలను ప్రవేశ పెట్టాలని చెప్పడంతో పాటు, మరికొన్ని సూచనలు చేశారు. రిజర్వుబ్యాంకు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 2023 నాటికి మొత్తం దేశీయ డిపాజిట్లు 4.8 శాతం తగ్గినట్టు నివేదిక పేర్కొంది. 1995 తరువాత వార్షిక డిపాజిట్లలో ఈ స్థాయి తగ్గుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. గత ఏడాది 43.5 శాతంగా ఉన్న కరెంటు అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ (సిఎఎస్‌ఎ) డిపాజిట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 41 శాతానికి తగ్గాయి. ఇది దాదాపుగా కరోనా వ్యాప్తికి ముందున్న సంవత్సరాలకు సమానం! రిజర్వు బ్యాంకుతో పాటు ఎస్‌బీఐ నివేదిక కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ క్షీణత మరింతగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గడానికి దారితీసిన అసలైన కారణాలను రిజర్వుబ్యాంకు గానీ, ప్రభుత్వంగానీ గుర్తించిందా అన్నదే అసలైన ప్రశ్న!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో (ఏప్రిల్ నెలలో) రిజర్వుబ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారమే మన దేశంలో పొదుపు గణనీయంగా పడిపోయింది. దేశంలోని కుటుంబాల నికర పొదుపు 47 ఏండ్ల కనిష్టానికి పడిపోయిందని ఆ నివేదికలో రిజర్వుబ్యాంకే పేర్కొంది. 2022లో దేశ జిడిపిలో 7.3 శాతంగా ఉన్న పొదుపు 2023లో 5.3 శాతానికి పడిపోయింది. బ్యాంకుల డిపాజిట్లతో పాటు స్టాక్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ఈ పొదుపు లెక్కలను ఆర్‌బీఐ రూపొందించడం గమనార్హం. ఆ నివేదికలోనే కుటుంబాల అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయని కూడా ఆర్‌బిఐ పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల మొత్తం దేశ జీడీపీలో 5.8 శాతంగా ఉంది. 1970 తరువాత కుటుంబాల రుణం ఈ స్థాయిలో పెరగడం ఇది రెండోసారి! అప్పులు పెరిగితే కష్టపడి సంపాదించినదంతా దానిని తీర్చడానికే సరిపోతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పొదుపు చేయడానికి అవకాశం ఎక్కడిది? ఒకప్పుడు పొదుపు చేయడమంటేనే వివిధ దేశాల్లోని ప్రజలు ఇండియాను గుర్తుచేసుకునేవారు. చుక్కలను దాటి పరుగులు తీస్తున్న ధరలు ఆ పరిస్థితిని మార్చివేస్తున్నాయి. కనీస అవసరాలను తీర్చుకోవడానికే సామాన్యులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇటీవల విడుదలైన ఒక నివేదిక సామాన్యులపై ధరాఘాతం ఏ స్థాయిలో ఉందో తెలియచేస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఈ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం నిత్యావసరాల కోసం 2022వ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ (త్రైమాసికం)లో చేసిన ఖర్చుకంటే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 18 శాతం అధికంగా భారతీయ కుటుంబాలు ఖర్చు చేశాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులున్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటి అద్దెలు, విద్య, వైద్యం ఇలా అన్నీ తడిసి మోపెడవుతున్నాయి. పెరిగిన ఖర్చులకు తగ్గట్టుగా ప్రజల నిజ వేతనాలు పెరగడం లేదన్నది సుస్పష్టం. కొంచెం అటుఇటుగా పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ కొనసాగుతున్న ఈ పరిస్థితులను మార్చాలంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. అధిక ధరలకు కళ్లెం వేయాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున కల్పించాలి. అప్పుడే ప్రజల చేతుల్లో డబ్బు ఉంటుంది. పొదుపు చేయడం సాధ్యమవుతుంది. ఈ చర్యలు తీసుకోకుండా వడ్డీ రేట్లను పెంచినా ఫలితం శూన్యం!