– గతంలోనూ విచారించి భంగపడ్డారు
– న్యాయస్థానానికి ఆదాయ వ్యయాలను సమర్పించాం
– న్యూయార్క్ టైమ్స్‌ది బూటకపు, ప్రేరేపిత కథనం
– ప్రజావాణిని వినిపించనీయకుండా గొంతు నొక్కుతున్నారు
– పత్రికా స్వేచ్ఛ కోసం తుదికంటా పోరాడతాం : న్యూస్‌క్లిక్ ప్రకటన
నవ తెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
తమపై ఢిల్లీ పోలీసులు రుజువుకు నిలవని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని న్యూస్‌క్లిక్ పోర్టల్ విమర్శించింది. గతంలో అనేకసార్లు ఈడీ, ఐటీ, ఢిల్లీ పోలీసులు తమను విచారించారని, కానీ వారు ఆశించినది ఏమీ లేకపోవడంతో భంగపడ్డారని వ్యాఖ్యానించింది. తమ ఆదాయ వ్యయాలు న్యాయస్థానం ముందే ప్రకటించామని, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే నిధుల సమీకరణ జరిగిందని వివరించింది. ఢిల్లీ పోలీసులు తమ కార్యాలయంలో, ఉద్యోగుల నివాసాలలో సోదాలు నిర్వహించడం, అరెస్టులు చేయడంపై బుధవారం ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ”న్యూస్‌క్లిక్ కార్యాలయం, జర్నలిస్టుల నివాసాలు, న్యూస్‌క్లిక్‌తో సంబంధమున్న ఉద్యోగుల నివాసాలతో సహా వివిధ ప్రదేశాలలో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం మంగళవారం దాడులు నిర్వహించింది. చాలా మందిని విచారించారు. చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. మాకు ఎఫ్‌ఐఆర్ కాపీని ఇవ్వలేదు. మాపై మోపిన నేరాలేమిటో చెప్పలేదు. జప్తు చేసేందుకు అవసరమైన మెమోలు ఇవ్వలేదు. స్వాధీనం చేసుకున్న సమాచారం విలువ ఎంతో చెప్పలేదు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా న్యూస్‌క్లిక్ ప్రాంగణం, ఉద్యోగుల నివాసాల నుండి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కార్యకలాపాలను కొనసాగనివ్వకుండా మమ్మల్ని నిరోధించే ప్రయత్నంలో మా కార్యాలయాన్ని కూడా మూసివేశారు” అని న్యూస్‌క్లిక్ ఆ ప్రకటనలో తెలిపింది.”మా వెబ్‌సైట్‌లో చైనా అనుకూల ప్రచారానికి పాల్పడ్డామనే అభియోగంపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారని తెలుసుకున్నాము. పాత్రికేయుల స్వాతంత్య్రాన్ని గౌరవించడం తెలియని, హేతుబద్ధమైన విమర్శలను దేశద్రోహంగా లేదా దేశ వ్యతిరేక ప్రచారంగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము” అని ఆ ప్రకటన పేర్కొంది.”2021 నుండి ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలను ఉపయోగించి వరుస చర్యలతో న్యూస్‌క్లిక్‌ను ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. మా కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం, ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించాయి. పరికరాలు, లాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు మొదలైన వాటిని గతంలోనే స్వాధీనం చేసుకున్నారు. ఈ-మెయిల్స్‌ను, సమాచార మార్పిడులను మైక్రోస్కోప్‌లో విశ్లేషించారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఇన్వాయిస్‌లు, చేసిన ఖర్చులు, న్యూస్‌క్లిక్ ఆదాయ వనరులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంస్థలు పరిశీలిస్తున్నాయి. మా సంస్థకు చెందిన డైరెక్టర్లను, ఇతర వ్యక్తులను ప్రభుత్వ ఏజెన్సీలు గంటల తరబడి విచారించాయి” అని వివరించింది.”ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా మనీ లాండరింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ న్యూస్‌క్లిక్‌పై ఈడీ ఫిర్యాదు దాఖలు చేయలేకపోయింది. ఐపీసీ కింద న్యూస్‌క్లిక్‌పై నేరారోపణ చేస్తూ ఢిల్లీ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేకపోయింది. ఆదాయపుపన్ను శాఖ న్యాయస్థానాల ఎదుట తన చర్యలను సమర్థించుకోలేకపోయింది. గత కొన్ని నెలలుగా ప్రబీర్ పుర్కాయస్థను ఈ సంస్థలు కనీసం విచారణకు కూడా పిలవలేదు” అని న్యూస్‌క్లిక్ తెలిపింది.”న్యూస్‌క్లిక్‌కి సంబంధించిన సమాచారం, పత్రాలు, సమాచార మార్పిడికి సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ ఆరోపణలను ప్రభుత్వం రుజువు చేయలేకపోయింది. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ప్రేరేపిత, బూటకపు కథనాన్ని అడ్డు పెట్టుకొని క్రూరమైన ఉపా చట్టాన్ని అమలు చేయడానికి, సంస్థ కార్యాలయాన్ని మూసివేయడానికి పూనుకుంది. దేశ వాస్తవ చిత్రాన్ని నిర్భయంగా, స్వతంత్రంగా అందించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తోంది. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఇతర అణగారిన వర్గాల తరపున మాట్లాడే వారిని అణచివేయడంలో భాగంగానే మాపై దాడి జరిగింది” అని న్యూస్‌క్లిక్ పేర్కొంది.”న్యూస్‌క్లిక్ ఒక స్వతంత్ర వార్తా వెబ్‌సైట్. మా వార్తలు, వ్యాసాలు ఎప్పుడూ వృత్తిపరంగా అత్యున్నత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. న్యూస్‌క్లిక్ ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఏదైనా చైనా సంస్థ లేదా ఆ దేశ అధికారుల ఆదేశానుసారం ఎటువంటి వార్తలను, సమాచారాన్ని ప్రచురించదు. న్యూస్‌క్లిక్ తన వెబ్‌సైట్‌లో చైనా అనుకూల ప్రచారం చేయదు. న్యూస్‌క్లిక్ తన వెబ్‌సైట్‌లో పొందుపరచిన వార్తలు, వ్యాసాలకు సంబంధించి నెవిల్లే రారు సింఘమ్ నుండి ఆదేశాలు తీసుకోదు. న్యూస్‌క్లిక్‌కు అందిన నిధులన్నీ సక్రమమైన బ్యాంకింగ్ పద్ధతుల ద్వారా చేరుతున్నవే. ఈ వివరాలన్నింటినీ చట్ట ప్రకారం, ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశానుసారం అధికారులకు అందజేశాము” అని తెలిపింది. ”న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకూ ప్రచురించిన అన్ని వార్తలు, వ్యాసాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎవరైనా చూడవచ్చు. చైనా అనుకూల ప్రచారంగా భావించే ఒక్క కథనాన్ని కానీ, వీడియోను కానీ ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ప్రస్తావించలేదు. ఢిల్లీ అల్లర్లు, రైతుల నిరసనలు వంటి ఘటనలపై ప్రత్యేక విభాగం వేసిన ప్రశ్నల తీరు చూస్తుంటే ఈ వ్యవహారం వెనుక దురుద్దేశం, హానికరమైన ఉద్దేశం ఉన్నట్లు అర్థమవుతోంది” అని విమర్శించింది. కోర్టులు, న్యాయ ప్రక్రియలపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని, రాజ్యాంగం మేరకు పత్రికా స్వేచ్ఛ కోసం, తమ జీవితాల కోసం పోరాడతామని న్యూస్‌క్లిక్ స్పష్టం చేసింది.
ఈ దాడులపై జోక్యం చేసుకోండి
– సీజేఐ చంద్రచూడ్‌కు 18 మీడియా సంస్థల లేఖ
న్యూఢిల్లీ : దేశంలో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల పట్ల మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు బుధవారం లేఖ రాశాయి. పాత్రికేయుల ఫోన్లు, లాప్‌టాప్‌లను ఇష్టానుసారం స్వాధీనం చేసుకోకుండా నిలువరించేందుకు నిబంధనలను, జర్నలిస్టుల విచారణకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించడంలో సాయపడాలని విజ్ఞప్తి చేశాయి. చట్ట విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వ సంస్థలు, అధికారుల్లో జవాబుదారీతనం ఉండేలా చూడాలని కోరాయి. పాత్రికేయులు చట్టానికి అతీతులని తాము భావించడం లేదని, చట్టానికి లోబడి తమను విచారించాలని మాత్రమే కోరుతున్నామని తెలిపాయి. ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై 16 పాత్రికేయ సంఘాలు సంతకాలు చేశాయి.దేశంలోని పలువురు పాత్రికేయులు నేడు ప్రతీకార ప్రమాదాన్ని ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారని ఆ లేఖలో జర్నలిస్టు సంఘాలు తెలిపాయి. న్యూస్‌క్లిక్ పోర్టల్ పాత్రికేయులు, ఉద్యోగుల నివాసాలపై జరిగిన దాడులను, వారి నుండి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న వైనాన్ని వివరించాయి. ‘పత్రికలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలు పలు సందర్భాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన విషయం మీకు తెలిసిందే. న్యూస్‌క్లిక్ పాత్రికేయులపై నిర్దిష్టత లేని నేరారోపణలు చేశారు. వాటితో సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. ఉపా కింద అరెస్టయిన జర్నలిస్టులు బెయిల్ పొందడానికి ముందు నెలల తరబడి జైళ్లలో మగ్గాల్సి వస్తోంది. సిద్ధిక్ కప్పన్ అనే పాత్రికేయుడు బెయిల్ పొందడానికి ముందు 28 నెలలు జైలులో గడిపారు. ప్రభుత్వ చర్యలు ఇలాగే కొనసాగితే వాటిని సరిదిద్దే పరిస్థితే ఉండదు’ అని వివరించాయి. ఈ లేఖపై వివిధ నగరాలకు చెందిన ప్రెస్‌క్లబ్‌లు, మీడియా సంస్థలు సంతకాలు చేశాయి.