హామీలను ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలు

– బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని ఆర్మీ స్థలాల్లో నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్‌ కారిడార్లు గత సర్కార్‌ హయాంలో కొలిక్కి రాగా, వాటిని తమ ఘనతగా రేవంత్‌ సర్కార్‌ చెప్పుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లో సైతం చివరి దశలో ఉన్న వాటికి నియామక పత్రాలిచ్చి తామే ఇచ్చామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమలో అనిల్‌ కూర్మాచలం తదితరులు పాల్గొన్నారు.