– పడిపోతున్న ఆదాయాలు.. పెరుగుతున్న భారాలు
– 47 ఏండ్ల కనిష్టానికి తగ్గిన పొదుపు సామర్థ్యం..
– ఆర్థిక వ్యవస్థలో సంక్షోభ ఛాయలు
గతంలో ఏదో పనిచేసైనా ఉన్నదాంట్లో దాచుకునే వారు. ఇపుడు కుటుంబం గడవటానికే అప్పులకోసం వెంపర్లాట తప్పటంలేదు.పదేండ్ల మోడీపాలనలో పేదలు మరింతలవుతుంటే..పెద్దలు మాత్రం శత కోటీశ్వరులైపోతున్నారు. చదువుకుని డిగ్రీలు చేతపట్టుకుని…ఉద్యోగం లభించక నిరుద్యోగం పెరిగిపోతోంది. ఏటా రెండుకోట్లమందికి ఉద్యోగాలిస్తామని ప్రకటించి..దశాబ్దం అయినా దిక్కులేదు. ఉపాది óలేక, కాలే కడుపులకు గంజి కూడా దోరక్క జనం గగ్గోలు పెడుతున్నారు.మరోవైపు దేశంలో ఉన్న పేదలు మధ్యతరగతికి చేరుకుంటున్నారని బీజేపీ సర్కార్ అంటోంది. గరీబోళ్లకు ఇచ్చే సబ్సిడీలకు ఎగనామం పెట్టడానికి చర్యలు తీసుకుంటూనే..ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవటానికి 81 కోట్లమంది పేదలకు ఉచితబియ్యం అందిస్తామంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా నివేదికలు ఆర్థికవ్యవస్థ ముఖచిత్రాన్ని కండ్లకు కట్టినట్టు చూపుతున్నాయి.
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రజల ఆదాయాలు పడిపోవడం.. అప్పుల భారం పెరగడంతో దేశంలో ఆర్థిక సంక్షోభ చాయలు నెలకొన్నాయి. బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజల పొదుపు సామర్థ్యం దాదాపు ఐదు దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. ఉద్యోగాల్లేవ్, ఉపాధి కరువవటంతో..ఆదాయాలు, పొదుపు తగ్గింది. రుణాల భారం పెరగడంతో భారత కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయింది. 2023 డిసెంబర్ ముగింపు నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల అప్పు స్థాయి 40 శాతానికి చేరింది. మరోవైపు పొదుపు సామర్థ్యం జీడీపీలో 5 శాతానికి దిగజారి.. అతి కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెప్టెంబర్ 2023 అంచనా ప్రకారం.. 2022-23లో కుటుంబాల నికర విత్త పొదుపు స్థాయి జీడీపీలో 5.1 శాతానికి పడిపోయింది. ఇది 47 ఏండ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. దీన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించడం మరింత విమర్శలకు దారి తీసింది. నివాసాలు, వాహనాలు వంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి రుణాలు తీసుకోవడం వల్ల కుటుంబాలు గతంలో కంటే తక్కువ నిజ ఆస్తులను కలిగి ఉన్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇది సంక్షోభం కాదని, భవిష్యత్‌పై విశ్వాసమని చెప్పినా నమ్మే వారెవరూ లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ప్రకటించిన 2022-23 జాతీయాదాయం సవరించిన అంచనాల్లో.. కుటుంబాల పొదుపు స్థాయి జీడీపీలో 5.3 శాతానికి తగ్గి.. 47 ఏండ్ల కనిష్ట స్థాయికి దిగజారింది. మరోవైపు కుటుంబాల అప్పులు జీడీపీలో 38 శాతానికి ఎగిశాయి. 2020-21లో ఇది రికార్డ్ స్థాయిలో 39.1 శాతంగా ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలకు సంకేతం. మోతిలాల్ ఓస్వాల్ రిపోర్ట్ ప్రకారం.. 2022-23లో ప్రధానంగా ఆదాయాల వృద్థిలో బలహీనతలు కుటుంబాల పొదుపు శక్తిని దెబ్బతీశాయి. అదే విధంగా వినియోగ వ్యయాలు, భౌతిక పొదుపు పెరుగుదల సేవింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. 2023-24లోనూ ప్రయివేటు వినిమయం, కుటుంబాల పెట్టుబడుల్లో వృద్థి బలహీనంగా కనబడింది. కుటుంబాల వార్షిక అప్పులు 5.8 శాతానికి ఎగిసే అవకాశం ఉందని మోతిలాల్ ఓస్వాల్ పరిశోధకులు అంచనా వేశారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధికంగా నమోదు కానుందన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ అప్పులూ అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. వాటి చెల్లింపులకు ప్రజలపై అనేక భారాలు మోపడం, ధరలు పెంచడం, నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగిపోవడం, ప్రజల ఆదాయాలు పడిపోవడం తదితర అంశాలు కుటుంబాలను అప్పుల పాలు చేస్తున్నాయని ఈ నివేదిక చెబుతోంది.
గుదిబండగా వ్యక్తిగత రుణాలు..
అవసరాల కోసం తీసుకుంటున్న వ్యక్తిగత రుణాలు కుటుంబాలకు గుదిబండగా మారుతున్నాయి. డిసెంబర్ 2023 నాటికి కుటుంబాల అప్పులు జీడీపీలో 40 శాతానికి పెరిగి కొత్త గరిష్ట స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల డేటా ఆధారంగా అన్‌సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలు వేగంగా పెరిగి కుటుంబాల అప్పులను మరింత పెంచనున్నాయి. ఆ తర్వాత సురక్షిత రుణాలు, వ్యవసాయ రుణాలు, వ్యాపార రుణాలు వేగంగా పెరుగుతాయి.