– వారికి జీవనభృతి చెల్లించాలి
– ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో.. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి
నవతెలంగాణ – కరీంనగర్/ జూలపల్లి/నల్లగొండ
ఉచిత ప్రయాణం పథకంతో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని, రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి విన్నవించారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలోని ఆయన ఇంటి వద్ద కరీంనగర్ జిల్లా పబ్లిక్, ప్రయివేటు రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంత్రిని కలిసి సమస్యలపై గురువారం వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి.. తప్పకుండా డ్రైవర్లను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సమస్యపై పలు జిల్లాల్లో ఆటో డ్రైవర్లు ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల గ్రామీణ ప్రాంతాలు, మండలాల్లో వేలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి డ్రైవర్లకు కనీస వేతనం జీవో విడుదల చేయలేదని గుర్తు చేశారు. డ్రైవర్లకు కనీస వేతనం జీవో 25 విడుదల చేయాలని, కరీంనగర్ నగరంలో ట్రాఫిక్ సిగల్స్ ప్రారంభించాలని పార్కింగ్ స్థలాలు, ఆటో అడ్డాలు ఏర్పాటు చేయాలని కోరారు. ట్రాఫిక్ చాలన్లు రద్దు చేయాలని, ప్రభుత్వ శాఖల్లో వినియోగిస్తున్న అద్దె వాహనాల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. అద్దె పెంచాలని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా సవారీ యాప్ ప్రవేశపెట్టి డ్రైవర్లకు ఉపాధి చూపాలని కోరారు. ఓలా, ఉబర్, రాపిడో బైక్ యాప్ రద్దు చేయాలని, ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం చేయాలన్నారు. ఏ షరతు లేకుండా డ్రైవర్లకు రూ.10 లక్షలు ప్రమాద బీమా అమలు చేయాలన్నారు. రవాణా వాహనాలపై సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, పెట్రోలు, డీజిల్ ధరలు సుంకం తగ్గించాలని తెలిపారు. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పించాలని, పలు డిమాండ్లతో వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చెలికాని శ్రీనివాస్, లారీ డ్రైవర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు ఎంకే ఆరిఫ్ మొయినుద్దీన్, అమీర్, గుగులోతు రమేష్, గంగిపెల్లి కుమార్, గౌరవేణి కనకయ్య పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో చేసి అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని జీవనం సాగిస్తున్న తమకు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో అప్పుల భారం పెరిగి జీవితం మరింత దుర్భరంగా మారుతుందన్నారు. ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోని కనకపూర్ ప్రధాన కూడలిలో ధర్నా నిర్వహించారు.