– రెమ్యూనరేషన్‌లో తేడాలను సరిచేయాలి
– ఉపాధ్యాయులపై లాఠీచార్జీకి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి : సీఈవో వికాస్‌రాజ్‌కు టీఎస్‌యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికల శిక్షణ, పోలింగ్ సందర్భంగా వడదెబ్బ, రోడ్డు ప్రమాదాలు, గుండె, మెదడు సంబంధిత సమస్యలతో హఠాన్మరణానికి గురైన ఉపాధ్యాయులు, ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు మెరుగైన వైద్య చికిత్సనందించాలని కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మంగళవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో మైనారిటీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ, సిద్దిపేట జిల్లాలో లకావత్ రామన్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ శ్రీకృష్ణ మరణించారని తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గడిగొప్పుల సదానందం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మలకపల్లిలో ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వహించి తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లగా ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించారని వివరించారు. ములుగు జిల్లా బూరుగుపేట ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు పోరిక మధుకర్ బ్రెయిన్ స్ట్రోక్ తో తీవ్ర అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధుల్లో ఉండగా చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్ గ్రేషియా జిల్లా ఎన్నికల అధికారులు మంజూరు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. ఈ మొత్తాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులనుంచి చెల్లించి, తదనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు సత్వరమే ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల విధినిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరిన మధుకుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనీ, అతనికి ఎన్నికల సంఘం ఖర్చుతో మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప పారితోషికం చెల్లించాలని ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చిన ఆదేశాలను కొందరు జిల్లా ఎన్నికల అధికారులు పాటించలేదని జంగయ్య, చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా రెమ్యూనరేషన్ చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.