నాగాపూర్ లో కుటుంబ నిర్ధారణ సర్వే


 నవతెలంగాణ కమ్మర్ పల్లి 
మండలంలోని నాగాపూర్ లో గురువారం పలు సమస్యలతో నిలిచిపోయిన రుణమాఫీ పై ఫీల్డ్ సర్వే  ప్రారంభమైంది.  స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ సిబ్బంది  మండల నోడల్ అధికారిణి రమ్యశ్రీ ఆధ్వర్యంలో సాంకేతిక సమస్యలు ఉన్న రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు.రెండు లక్షల రుణమాఫీ కానీ రైతు కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో  సిబ్బంది పొందుపరుస్తున్నారు. రుణమాఫీ అందని రైతులు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్యాలయానికి  తరలివచ్చి తమ కుటుంబ సభ్యుల వివరాలను అధికారులకు అందజేస్తున్నారు. వాటిని వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ యాప్ లో నమోదు చేస్తున్నారు. కాగా మండలంలో 30న ఉప్లూర్, 31న కమ్మర్ పల్లి, సెప్టెంబర్ 2న  హాస కొత్తూర్, 3న బషీరాబాద్, 4న అమీర్ నగర్, 5న కోన సముందర్, 6న నర్సాపూర్, 9న  కోనాపూర్, కొత్తచెరువు తండా, 10న ఇనాయత్ నగర్, దొమ్మరి చౌడు తండా, 11న చౌట్ పల్లి, 12న బషీరాబాద్, 13న రాజరాజేశ్వరి నగర్ గ్రామాల్లో ఈ కుటుంబ నిర్ధారణ సర్వే జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. రుణమాఫీ కానీ రైతులు ఈ కుటుంబ నిర్ధారణ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.