
– దుశ్చర్యలను ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో చెలరేగిన మతోన్మాద దుశ్చర్యలను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. నుహలో తొలుత ప్రారంభమైన అల్లర్లు తర్వాత గురుగావ్‌కు విస్తరించాయి, అటుపై చోటు చేసుకున్న అల్లర్లు, గృహ దహనాల సంఘటనల్లో ఐదుగురు మరణించడానికి దారి తీశాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే మొత్తంగా ఈ పరిస్థితులకు కారణమని, పైగా ఆ పరిణామాలకు ప్రభుత్వం కూడా పరోక్షంగా సహకరించిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. బ్రజ్ మండల్ యాత్ర నిర్వహణ సాకుతో, హిందూత్వ శక్తులు – బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌లు సామాజిక మాధ్యమాల్లో అత్యంత రెచ్చగొట్టే రీతిలో ప్రచారాన్ని ప్రారంభించాయి.
నాసిర్, జునైద్‌లను వేధించి చంపేసిన కేసుతో సంబంధమున్న మోనూ మనేసర్ ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా తన మద్దతుదారులకు బహిరంగంగానే పిలుపిచ్చాడు. బాధ్యతాయుతమైన నుయ ప్రజల విజ్ఞప్తులను పట్టించుకోకుండా, మనేసర్‌పై చర్యలు తీసుకోవడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం యాత్రకు అనుమతినిచ్చింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, అవాంఛనీయ సంఘటనలు తలెత్తిన పక్షంలో వాటిని నివారించేందుకు ఎలాంటి సన్నాహక చర్యలు చేపట్టకుండా యాత్రను అనుమతించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో వుంచుకుని మతోన్మాద ధోరణులను రెచ్చగొట్టాలనే ఏకైక లక్ష్యంతో ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ ప్రయత్నాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో నిర్ద్వంద్వంగా ఖండించింది.
ఈ విద్వేష నేరాన్ని ఖండించాలి..సీపీఐ(ఎం)
ముంబయి వెళుతున్న రైల్లో ఆర్‌పిఎఫ్‌కి చెందిన కానిస్టేబుల్ తన సీనియర్‌ని, మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపిన ఘటనను ఒక వ్యక్తి కలత చెందిన మనస్సుతో చేసిన చర్యలుగా చూడరాదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. తొలుత మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి జరిపిన కాల్పులుగా పేర్కొన్న అధికారులు ఆ సంఘటనపై దర్యాప్తుకు చర్యలు తీసుకున్నారు. హత్యకు గురైన వారందరూ ముస్లింలేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఆ కానిస్టేబుల్ ఒక కోచ్ నుండి మరో కోచ్‌లోకి పరిగెడుతూ ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడని పేర్కొంది. ముస్లింలను ముప్పు కలిగించే వారిగా పేర్కొంటూ వారికి వ్యతిరేకంగా మతోన్మాద డిక్షనరీలోని ప్రతి మాటను ఉపయోగిస్తూ అధికారంలో వున్న వారు ప్రతి రోజూ చేసే విద్వేష ప్రసంగాల ప్రత్యక్ష ఫలితమే ఈ కాల్పులని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ముస్లింలకు పాకిస్తాన్ నాయకత్వం వహిస్తోందని, వారు భారత్‌లో జీవించాలనుకుంటే మోడీ, యోగీలకు ఓటు వేయాల్సిందేనని ఆ వ్యక్తి ప్రత్యేకంగా పేర్కొంటున్న వీడియో బయటకు వచ్చింది. అయితే ఈ వీడియో విశ్వసనీయమైనదో కాదో నిర్ధారించాల్సి వుంది. బీజేపీ నేతలు ఉపయోగించే భాషనే ఆ వ్యక్తి కూడా ఉపయోగించాడు. విద్వేష ప్రసంగాలెప్పుడూ దేశ వినాశకరమైన పర్యవసానాలకే దారి తీస్తాయని, అటువంటి వాటిని కఠినంగా ఎదుర్కొనాల్సి వుందని సుప్రీం కోర్టు పదే పదే హెచ్చరిస్తూ వస్తోంది. భద్రత కల్పించడానికి అధికారికంగా నిర్దేశించబడిన వారిపై ఇటువంటి మతోన్మాద ఆలోచనా ధోరణి ప్రభావం చూపుతుందని ఈ సంఘటన స్పష్టంగా రుజువు చేసిందని, ఇది మరింత ఆందోళన కలిగించే అంశమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. హిందూత్వ శక్తుల విషపూరితమైన ఎజెండా దేశాన్ని లోతైన అగాధంలోకి నెడుతోందని, ఖండించదగిన ఈ చర్య భారతదేశానికి మేల్కోలుపు వంటిదని పొలిట్‌బ్యూరో పేర్కొంది.