జాతీయోద్యమ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేస్తున్న మతోన్మాదులు

నవతెలంగాణ-వైరాటౌన్‌
దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేస్తూ ప్రపంచీకరణ, స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి ప్రమాదం తీసుకు వస్తున్నారని, స్వతంత్ర పోరాట స్ఫూర్తితో దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుకోవాలని చరిత్ర అధ్యాపకులు డాక్టర్‌ నాగుర్‌ అన్నారు. ఆదివారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో వైరా స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ బోడపట్ల రవీందర్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో భారత స్వతంత్ర పోరాటం పైన డాక్టర్‌ నాగుర్‌ ప్రసంగించారు. జాతీయోద్యమంలో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని తరగతులు, వర్గాల ప్రజలు భాగస్వామ్యం వహించారని అన్నారు. భారత స్వతంత్ర పోరాటం దేశ ప్రజలలో చైతన్యం, త్యాగం నింపిందని అన్నారు. రైతాంగ, కార్మిక ఉద్యమాలు, జాతీయోద్యమంలో అంతర్భాగంగా నడిచాయని అన్నారు. ఆనాడు బ్రిటిష్‌ ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరించిన సంస్థలు, వ్యక్తుల వారసులు నేడు జాతీయోద్యమ నాయకులు పైన తప్పుడు ప్రచారం చేస్తూ దేశమంతటా విద్వేషం నింపుతున్నారని అన్నారు. దేశ సమైక్యత సమగ్రత కోసం కృషి చేయాలని, మణిపూర్‌లో సోదర భావంతో కలిసి జీవిస్తున్న తెగల మధ్య ఓట్ల రాజకీయం కోసం చిచ్చు పెట్టిన పరిస్థితి దాపురించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మాజీ ఎంపిపి బొంతు సమత, సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, మల్లెంపాటి రామారావు, పారుపల్లి కృష్ణారావు, మందడపు రామారావు, నారికొండ అమరేందర్‌, వడ్లమూడి మధు, యనమద్ది రామకృష్ణ, తోట కృష్ణవేణి, సంక్రాంతి పురుషోత్తం, మల్లెంపాటి ప్రసాదరావు, రాచభంటి భత్తిరన్న, పైడిపల్లి సాంబశివరావు, రుద్రాక్షల నరసింహచారి, గుమ్మా నరసింహరావు, హరి వెంకటేశ్వరావు, గొల్లపూడి ప్రకాశరావు, పారుపల్లి శ్రీనాధ్‌ బాబు, సామినేని నరసింహరావు, కొమ్మెన బాబు తదితరులు పాల్గొన్నారు.