‘ఊసులు’ అని చెప్పబడే ఆన్‌లైన్ మేగజైన్ నిర్వహించే ఈ రచయిత లోగడ ‘సాగరకన్య’ అనే నవల రాయడం మొదలుపెట్టినప్పుడు, ఏదైనా ‘హారర్’ రాయండి అన్న పాఠకుల కోరిక మేరకు ప్రస్తుత నవల ‘లీల’ (ఒకటో భాగం) రాశారట.
తాను రాసిన నవల ఏదైనా తనదైన ముద్ర వుండాలనిపించి ప్రస్తుత నవల రాశానంటారు రచయిత. అందువల్లే ఈ రచనలో మనుషులతో బాటు ఆత్మలు వుంటాయి. అవి కథలోని ముఖ్యపాత్రలతో సంభాషిస్తాయి. వెంట నడుస్తాయి.
సైన్సు, మంత్ర విద్యలు, సమాజంలో జరిగే దారుణాలు.. ఈ మూడు పాయల్ని కలిపి జడలా అల్లిన నవల ఇది. హారర్ నవలల్లో సాధారణంగా వివరించబడే స్మశానం, కాలుతోన్న చితులు, నల్ల పిల్లులు, గుడ్లగూబలు అర్ధరాత్రి చీకట్లతో బాటు రచయిత తన ఊహా శాలిత టైం మెషీన్‌తో (గతంలోకి, వర్తమానం లోకి పయనించగల వాహనం) నలుగురైదుగురు పాత్రలతో నవల నడుస్తుంది.
నవలలో రచయిత వివరించిన సంఘటనల సాధ్యాసాధ్యాలు విస్మరించి ముందుకు సాగే పాఠకులకు ఏ పాత్ర ఎప్పుడు వస్తుందో, ఎలా ప్రవర్తిస్తుందో, ఎప్పుడు భౌతిక ప్రపంచంలో నడుస్తుందో… ఎప్పుడు ‘ఆత్మల’ లోకాలకు వెళ్తుందో… అంతుపట్టనంత సస్పెన్స్ ఉంది. మెదడుకు మేత వుంది. ‘లీల’ మొదటి భాగమని, ‘వీర’ రెండవ భాగం వుంటుందని రచయిత ముందే సూచిస్తే బావుండేది.
– కూర చిదంబరం, 8639338675