సుదూరం

far awayస్నేహనికైనా బంధాలకైనా
దూరం అవగింజంత
మనసులు కలవాలి గాని
తలంపుకి వస్తే
గాలిలో పిట్టలా
రివ్వుమని ఎగిరే వాళ్ళం !

ఊరి చివర ఇల్లు కూడా
పక్కింటి గోడలా ఉండేది
కల్మషం ఎరగని మనసులో
ప్రేమాభిమానాలకు
ఆప్యాయతలకు
పట్టింపులు ఉండేవికావు!

మనం కలిసిన ప్రతిసారి
నీ కళ్ళలో దీపావళి మతాబులు
వెళ్లివిరిసేవి
నా పెదవులపై పువ్వులు
విరగబుసేవి
పగలు రాత్రి మన కబుర్లతో
మైమరిచిపోయేవి!

బాధ్యతల ఊబిలో కూరుకుపోయి
ఊపిరి సల్పనపుడు
నీ మాటలు నాకు ఊరటనిచ్చేవి
నీకో సైన్యం ఉందనే ధైర్యం
చీకటిలో వెన్నెల నవ్వుల్లా
తోడుగా దారిచూపేది
కష్టాలను దాటే శక్తినిచ్చేది !

కానీ ఇపుడు
స్థితి, స్తోమతల జతకట్టి
నీకు నాకు మధ్య దూరం
నింగి నేలలా మారింది
దేహానికి నీడకు మద్య
అహం అనే ముసురు కమ్మీ
బంధాలు అనుబంధాలు
వెలిసిపోయాయి!!
– జ్యోతి మువ్వల, 9008083344