ఈ-గరుడలో ఛార్జీల తగ్గింపు

 నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో తిరుగుతున్న ‘ఈ-గరుడ’ ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ప్రారంభోత్సవ ఆఫర్‌గా చార్జీలు తగ్గిస్తున్నట్టు టీస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. నెలరోజులు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. ‘ఈ-గరుడ’ బస్సుల్ని మంగళవారం మియాపూర్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి విడతగా పై రూట్‌లో పది ఎలక్ట్రిక్‌ బస్సుల్ని నడుపుతున్నారు. మియాపూర్‌ నుంచి విజయవాడకు టిక్కెట్‌ ధర రూ.830గా నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని రూ.760కి తగ్గించినట్టు తెలిపారు. అలాగే ఎంజీబీఎస్‌ నుంచి విజయవాడకు రూ.780గా ఉన్న టికెట్‌ ధరను రూ.720కి తగ్గించారు. ఈ ఏడాది చివరి నాటికి మరో 40 ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ఈ రూట్‌లో నడపాలని ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బస్సుకు టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా సంస్థ వెబ్‌సైట్‌లో రిజర్వేషన్లు చేసుకోవచ్చు.