పేస్‌ దిగ్గజం వీడ్కోలు

Farewell to the giant of pace– తొలి టెస్టులో విండీస్‌పై ఇంగ్లాండ్‌ గెలుపు
లార్డ్స్‌ : పేస్‌ దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. టెస్టు క్రికెట్‌ కెరీర్‌లో 704 వికెట్ల ఘనతతో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. కెరీర్‌ ఆఖరు మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అండర్సన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. యువ పేసర్‌ గస్‌ అటిక్సన్‌ 12 వికెట్ల ప్రదర్శనతో తొలి టెస్టులో వెస్టిండీస్‌ చిత్తుగా ఓడింది. విండీస్‌ వరుసగా 121, 136 పరుగులకు కుప్పకూలగా.. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.
ఆల్‌టైమ్‌ లెజెండ్‌: 42 ఏండ్ల జేమ్స్‌ అండర్సన్‌ కెరీర్‌ను అత్యున్నతంగా ముగించాడు. ఆఖరు మ్యాచ్‌లోనూ బంతితో నిప్పులు చెరిగాడు. కెరీర్‌ 704 వికెట్లతో ఆల్‌టైమ్‌ లెజెండ్‌గా ఆట నుంచి నిష్క్రమించాడు. 2003 లార్డ్స్‌ టెస్టులో జింబాబ్వేపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జేమ్స్‌ అండర్సన్‌.. అదే మైదానంలో 2024లో వెస్టిండీస్‌పై లాంఛనం ముగించాడు. 188 టెస్టులు ఆడిన జేమ్స్‌ అండర్సన్‌ 26.45 సగటు, 2.79 ఎకానమీ, 56.8 స్ట్రయిక్‌రేట్‌తో 704 వికెట్లు పడగొట్టాడు. ఓ ఇన్నింగ్స్‌లో 7/42, ఓ మ్యాచ్‌లో 11/71 అండర్సన్‌ అత్యుత్తమ గణాంకాలు. 32 సార్లు నాలుగు వికెట్లు, 32 సార్లు ఐదు వికెట్లు సహా 3 సార్లు పది వికెట్ల ప్రదర్శన అండర్సన్‌ సొంతం. ఆఖరు మ్యాచ్‌లో గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ దక్కించుకున్న అండర్సన్‌.. మైదానంలో జట్టును ముందుండి నడిపించాడు. దిగ్గజం అండర్సన్‌కు ఇంగ్లీశ్‌ అభిమానులు లార్డ్స్‌లో భావోద్వేగ వీడ్కోలు పలికారు.