
– మార్చి నాటికి సాగు విస్తరణ లక్ష్యం పూర్తి..
– పోడు భూముల కూ రాయితీ మొక్కలు..
– టీ.ఎస్ ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి వెల్లడి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
సిద్దిపేటలో రూ.255 కోట్లు నిధులతో ఫాం ఆయిల్ కాంప్లెక్స్ ఏర్పాటు కు రూపకల్పన చేస్తున్నట్లు, ఇందుకు గాను ఎన్.డి.డి.బి (నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్)లో ఋణం పొందుతున్నట్లు టి.ఎస్ ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణా రెడ్డి వెల్లడించారు. సంస్థలో నిర్వహిస్తున్న అభివృద్ది పనులు పురోగతి పరిశీలించడానికి అశ్వారావుపేట వచ్చిన ఆయన బుధవారం స్థానిక ఫాం ఆయిల్ పరిశ్రమ పరిపాలనా కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. భవిష్యత్ లో రైతులకు ఎటువంటి ఫ్రూట్ హాలీడే లు ఉండవని,పామాయిల్ సాగు విస్తరణ,గెలలు దిగుబడికి అనుగుణంగా ఫ్యాక్టరీల సామార్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.గతంలో ఫ్యాక్టర్ సామర్థ్యానికి మించి గెలలు సేకరించటం వల్ల ఫ్రూట్ హాలీడే ఇవ్వాల్సి వచ్చేదని చెప్పారు.ముందుగా నారంవారిగూడెం నర్సరీలో మొక్కల పెంపకాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి గెస్ట్ హౌస్ పనులతో పాటు అశ్వారావుపేట ఫ్యాక్టర్ ప్రాంగణంలో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేశారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టరు సూచించారు. అశ్వారావుపేటలో రోజుకు 300 మెట్రిక్ టన్నుల గెలలు క్రస్సింగ్ చేసేలా రెండో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని,అదేవిధంగా దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీ ని 1800 టన్నుల సామర్థ్యానికి విస్తరిస్తున్నట్లు వివరించారు. ఈ రెండు ఫ్యాక్టరీలు పూర్తి అయితే వచ్చే నాలుగేళ్ళలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. సిద్దిపేటలో రూ.255 కోట్లతో భారతదేశంలోనే ప్రయివేట్ ఫ్యాక్టరీలు సైతం నిర్మించ లేని విధంగా రిఫైనరీ,ప్యాకింగ్,ప ఉత్పత్తుల తయారీకి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికీ బోర్డు అనుమతులు తీసుకున్నామని, రుణం కోసం ఎస్డీడీబీకి లేఖ రాసినట్లు చెప్పారు.2025 లో సిద్దిపేట ఫ్యాక్టరీ ని ప్రారంభిస్తామని ప్రకటించారు.మొదటి 30 టన్నుల సామర్ధ్యం తో ఫ్యాక్టరీ ని ప్రారంభించి సాగు విస్తరణ పెరిగిన తర్వాత 120 టన్నుల కు పెంచుతామని అన్నారు.టీఎస్ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలోని 8 జిల్లాల్లో ఈ ఏడాది 45 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరించే లా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు 12 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి అయ్యిందని, మిగతా లక్ష్యాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.పోడు భూములకు సైతం సబ్సిడీ పై మొక్కలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పోడు పట్టాలు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫాం మొబైల్ యాప్ నందు నమోదు అవుతున్నాయని, నమోదు పూర్తి అయిన వెంటనే పోడు రైతులకు మొక్కలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, మేనేజర్ నాగబాబు, బానాల వెంకటేష్, పవన్, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ గౌడ్, ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ నాయుడు రాధాకృష్ణ పలువురు రైతు సంఘం నాయకులు ఉన్నారు.