రైతు భరోసా విడుదల చేయాలి

– తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌
నవతెలంగాణ-వైరాటౌన్‌
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతు భరోసా విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలోని లింగన్న పాలెం గ్రామంలో జరిగిన రైతు సంఘం సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ ముందస్తుగా నైరుతి రుతుపవనాలు ప్రభావంతో మే నెల చివర్లో అనుకూలంగా వర్షం రావడంతో జూన్‌ నెలలో మొదటి, రెండవ వారంలో రైతులు పత్తి విత్తనాలు వేశారని, తిరిగి వాతావరణం మార్పు వచ్చి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి వేసిన విత్తనాలు మొలక రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, గత రబీ సీజన్లో డిసెంబర్‌ నుంచి వర్షాలు కురవక, ప్రాజెక్టులలో నీరు లేక, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు కింద సాగు చేయలేదని, అరకొరగా సాగుచేసిన పంటలు ఎండిపోయి తీవ్రంగా రైతులు నష్టపోయారని, మామిడి లాంటి పండ్లు తోటలు రైతులు కూడా దిగుబడులు గణనీయంగా తగ్గి ఆదాయం లేక అప్పులు చేసే పరిస్థితి నెలకొందని, రైతులు అవసరాల కోసం రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నియమనిబంధనలు రూపకల్పన కోసం మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి జులై 15 వరకు గడువు ఇవ్వడం, మరల అసెంబ్లీలో చర్చ కూడా జరపాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనతో మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతు బంధు నిబంధనలు ప్రకారం రబీ సీజన్లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకారం ఈ ఖరీఫ్‌ సీజన్‌ రైతు భరోసా తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు మేడా శరాబంధి, కౌలు రైతు సంఘం నాయకులు యనమద్ది రామకృష్ణ, ఎస్‌.కె జానీ మియా, బాణాల కృష్ణమాచారి, హరి వెంకటేశ్వరరావు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.