ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

నవతెలంగాణ – ఇల్లంతకుంట
ఆర్థిక ఇబ్బందులతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రైతు పత్తెము తిరుపతి(39) తన ఎకరం భూమికి తోడు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. ఈ క్రమంలో సరిగా పంట దిగుబడి రాక చేసిన అప్పులు రెండింతలయ్యాయి. కొన్నిరోజుల కిందట పెద్ద కూతురు వివాహం చేయగా అందుకు మరికొంత అప్పు చేశాడు. అప్పులు రూ.10లక్షల వరకు పెరగడంతో తీర్చలేనని ఆందోళనకు గురయ్యాడు. వ్యవసాయ భూమి వద్ద శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. రైతుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.