నవతెలంగాణ-భిక్కనూర్
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింలు (43) తన వ్యవసాయ బావిలో మూడు నెలల క్రితం అప్పులు తెచ్చి మూడు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. దాంతో అప్పుల బాధ ఎక్కువై తీవ్ర మనస్తాపం చెంది శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు.