రైతు రుణమాఫీని వెంటనే చేపట్టాలి

– డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ-ఆమనగల్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో రూ.1లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని హమీ ఇచ్చిన ఇంత వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయలేదని, వెంటనే రైతు రుణమాఫీని చేపట్టాలని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం కడ్తాల్‌ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి 3 సార్లు అసెంబ్లీలో ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. అరకొరగా రూ.25 వేల రుణాల వరకే రుణ మాఫీ చేసిందని, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రైతు రుణమాఫీ చేస్తామని మెనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్న పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా ఊరిస్తూ కాలం వెళ్ల దీస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులు రుణమాఫీ ఎప్పుడవుతుందోనని రైతులు ఆశగా ఎదురూ చూస్తున్నారని, బ్యాంకుల్లో వడ్డికి వడ్డి జమచేస్తూ రైతులకు రుణభారాన్ని మోపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో రైతులు పంట రుణాలు చెల్లించలేకపోవడంతో బ్యాంకులో వారి అప్పు మరింత ఎక్కువైందని అన్నారు. ఈ నేపథ్యంలో తిరిగి పంట రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాక పోవడంతో బ్యాంకర్లు రైతులపై రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఉద్యమిస్తామని శ్రీనివాస్‌ రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నరసింహ ముదిరాజ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బిచ్యా నాయక్‌, సర్పంచ్‌ పాండు నాయక్‌, కో-ఆప్షన్‌ సభ్యులు జహంగీర్‌ బాబా, సింగిల్‌ విండో డైరెక్టర్‌ చేగూరి వెంకటేష్‌, నాయకులు లక్ష్మయ్య, రాజేష్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.