నవతెలంగాణ – చిన్నకోడూరు
తెలంగాణ రాష్ట్ర ఏర్పడి 9సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ రైతు దినోత్సవం కార్యక్రమాన్ని రోజా శర్మ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని కోరారు. ప్రతి రైతును లక్షాధికారి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం అని, రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఉత్తమ కనబరిచిన రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చంద్రకళ రవి గౌడ్, లింగమూర్తి సంతోషివిక్రమాదిత్య, ఎంపీటీసీలు దుర్గారెడ్డి, లక్ష్మీయాదవరెడ్డి, సాయన్న, అధికారులు, రైతులు పాల్గొన్నారు.