వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే లక్ష్యంతో కేంద్రం చేసిన మూడు నల్లచట్టాలపై పదమూడు నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటం జరిగింది. ఆ చట్టాలవలే కత్తిమీద సాములా వేలాడుతున్న విద్యుత్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు పాలకులు. ఇది కూడా నల్లచట్టమే అనేది స్పష్టం. మూడు వ్యవసాయ చట్టాలు రైతులు, వ్యవసాయ కూలీలపై మాత్రమే ప్రత్యక్ష దాడి. కానీ విద్యుత్ రంగంలో మాత్రం ఈబిల్లు ప్రతి పేదవారిపై దాడి. పట్టణ పేదలు, గ్రామీణ పేదలు వినియోగదారులు, విద్యుత్తు కార్మికులు ఎవరైనా కావచ్చు ఇది అందరిపైనా ప్రభావం చూపే బిల్లు. అందువల్ల ఈ విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా ఐక్య పోరాట ప్రతిఘటనను వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పోరాడితే నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు 1947లో స్వాతంత్య్రం వచ్చింది. నేటికీ దోపిడీ, అన్యాయం కొనసాగుతుందా లేదా? 1977లో జేపీ ఉద్యమం తర్వాత ఎన్నికలొచ్చి నప్పుడు కూడా మోసపోయామా లేదా? 1991 నుంచి ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తూ తీసుకొచ్చిన నూతన ఆర్థిక విధానాలు ప్రజల్ని మోసం చేశాయా లేదా? 2000 సంవత్సరం నుండి 2014 వరకు వచ్చిన ప్రభుత్వాలతో మోసపోతున్నామా లేదా? దేశాన్ని మత విద్వేషాలతో పాలిస్తున్న ఈ తొమ్మిదేండ్ల మోడీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు మోస్తున్నారు కదా! ఈ మోడీని తరిమికొట్టడం కూడా ఒక ముఖ్యమైన ప్రశ్న. అయితే పోరాటం అలా కాదు. మోడీ ప్రభుత్వం వెనుక ఎవరున్నారు? గత ప్రభుత్వాల వెనుక ఎవరున్నారు? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి రంగంలో, వ్యవసాయంలో, ప్రతి పరిశ్రమలో కూలీలను, రైతులను దోపిడీి చేస్తున్న వారి వెనుక ఉన్న పెట్టుబడిదారులు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడమే అత్యంత ముఖ్యమైన విషయం. అదానీ, అంబానీ, కార్పొరేట్లు, పెట్టుబడిదారులను తరిమికొట్టాలి. అయితే ఇది కార్మికులు, రైతులు, కూలీల ఉద్యమం ద్వారానే సాధ్యం. వారంతా సంఘటితం కావాలి.ఈ అవగాహనతో ఉద్యమాలను బలో పేతం చేయాలి. ఇదే లక్ష్యంతో ముందుకు సాగాలి.
– మూడ్ శోభన్, 9949725951