రైతులకు బ్యాక్ వాటర్ భయం..

Farmers are afraid of back water.నవతెలంగాణ – మల్హర్ రావు
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని మానేరు పరివాహక ప్రాంతలైన తాడిచెర్ల, మల్లారం,పివి నగర్,కుంభంపల్లి, వల్లెoకంట,కేశారంపల్లి గ్రామాల రైతులకు ఇటు చెక్ డ్యామ్స్, అటు కాళేశ్వరం బ్యాక్ వాటర్ భయం పట్టుకుంది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు భయాందోళన  చెందుతున్నారు.ఇప్పటికే మానేరు ఉదృతంగా ప్రవహించడం,ఇందుకు తోడుగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో కుంభంపల్లి,దామెరకుంట,గంగారం గ్రామాల్లోని ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరి,పత్తి పంటలు నీట మునిగి,ఇండ్లలోకి నిరుచేరి గ్రామాలు జలదిగ్బందానికి మారడం పరిపాటిగా మారుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా రైతులకు బ్యాక్ వాటర్ భయం వెంటాడుతుంది.
ఆందోళనలో రైతన్నలు..
ఈ సంవత్సరం ఖరీప్ ప్రారంభంలో వర్షాలు మురిపించి,ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషంగా విత్తనాలు విత్తుకున్నారు.అక్కడక్కడా నారుమళ్లు పచ్చబడటం, పత్తి మొలకెత్తడం,కొన్ని గ్రామాల్లో రెండు ఆకుల్లో కనిపించడం మినహా ఈ ఏడాది పెద్డగా ఇబ్బందులు తలెత్తలేదు.దీంతో ఈ ఏడాది మండలంలో 20,300 ఎకరాల్లో సాగు చేయగా ఇందులో పత్తి 8,100, వరి 11,950,మిగతా 250 ఎకరాల్లో ఇతర పంటలు వేసేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికి వేసిన 4,670 ఎకరాల్లో పంటలు పచ్చగా పురుగు లేకుండా బాగుంది అనే సమయంలో ముసురు కమ్ముకుంటే  పత్తి,వరి నారుమళ్లు నీట మునిగి రైతులు నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇందుకు తోడుగా మానేరు ఉగ్రరూపం దాల్చడం, కాళేశ్వరం బ్యాక్ వాటర్ వస్తే పరిస్థితి ఏమిటని రైతులు తలలు పట్టుకుంటున్నారు.
బ్యాక్ వాటర్ చేరకుండా కరకట్ట నిర్మించాలి: మాజీ ఎంపీపీ మల్హర్ రావు
మానేరు పరివాహక ప్రాంతాల్లో కాళేశ్వరం, మిడ్ మానేరు బ్యాక్ వాటర్, మానేరు ముంపునకు పొలాలు గురికాకుండా 10 మీటర్ల ఎత్తుతో తాడిచెర్ల నుంచి కుంభంపల్లి వరకు కరకట్ట నిర్మించాలి.గత మూడు సంవత్సరాలుగా ముంపునకు గురివుతున్న పొలాలకు గత ప్రభుత్వం నష్టపరిహారం సైతం అందించలేదు.
చెక్ డ్యామ్ నిర్మాణాలతో రైతులకు నష్టం: అక్కల బాపు  ప్రజాసంఘాల నాయకుడు
మానేరుపై నిర్మాణం చేస్తున్న చెక్ డ్యామ్ లతో రైతులకు ఒరిగేది ఎం లేదు నష్టం తప్పా.పాలకుల, గుత్తేదారుల,అధికారుల కమీషన్ల కోసమే కోట్ల ప్రజాసొమ్ముతో చెక్ డ్యామ్ లు నిర్మిస్తున్నారు.వీటివల్ల మానేరు పరివాహక ప్రాంతాల్లో ప్రతియేటా వేలాది ఎకరాల పొలాలు ముంపుకు గురియై రైతులు లక్షల రూపాయల పంటలు నష్టపోతున్నారు.