కంగనపై రైతుల ఆగ్రహం

కంగనపై రైతుల ఆగ్రహం– బీజేపీ ఎంపీ అభ్యర్థి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
– క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
– పార్లమెంట్‌లో ఏనాడూ రైతుల సమస్యలు లేవనెత్తని బీజేపీ ఎంపీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కంగన రనౌత్‌పై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2021-22లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులను కించపరచినందుకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి. సంయుక్త కిసాన్‌ మంచ్‌ కన్వీనర్‌ హరీశ్‌ చౌహాన్‌ మీడియాతో మాట్లాడుతూ నాడు జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్‌ మహిళా రైతును కంగన తప్పుగా చిత్రీకరించి, రైతులను కించపరిచారని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్‌ బాగ్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న బిల్కిస్‌ బానో (80)గా ఆ పంజాబ్‌ రైతును పేర్కొన్నారని చెప్పారు. ”రైతు సంఘాన్ని అవమా నించిన కంగనా రైతుల ఓట్లను ఎలా అడుగుతుంది. మా మద్దతును ఎలా ఆశించగలదు? ఆమె ముందుగా క్షమాపణ చెప్పాలి” అని అన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ఓటర్లు రైతులే అయిన ప్పటికీ, వారి సమస్యలను పదేండ్లుగా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పట్టించుకోలేదని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రైతుల కోసం పోరాడే అభ్యర్థులకే ఎస్కేఎం మద్దతు ఇస్తుందని అన్నారు. ఇరాన్‌ నుంచి తక్కువ ధరకే యాపిల్‌ను దిగుమతి చేసు కోవ డంతో పలు జిల్లాల్లోని రైతులకు ఆధారమైన యాపిల్‌ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకు పోయింది. ప్రభుత్వం కిలో కనీస ధర రూ.50 నిర్ణయించి నప్పటికీ, దిగుమతి చేసుకున్న యాపిల్‌ను కిలో రూ.40కి విక్రయిస్తున్నారని, ఇది యాపిల్‌ పరిశ్రమకు నాశనమని అన్నారు. మార్కెట్‌ ఇంటర్వె న్షన్‌ స్కీమ్‌ (ఎంఐఎస్‌) కింద పండ్లకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) నిర్ణయించాలని డిమాండ్‌ చేసిన చౌహాన్‌, కేంద్ర ప్రభుత్వం ఎంఐఎస్‌ను రద్దు చేసిం దని, రైతులకు రూ.70 కోట్ల బకాయిలు చెల్లించ లేదని విమ ర్శించారు. ఎస్కేఎం పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక డిమాండ్‌లను ఆమోదించిందని, అయితే ఎంపీలు మాత్రం తమ డిమాండ్‌లను పార్ల మెంటులో ఏనాడూ లేవనెత్తలేదని అన్నారు. ముఖ్యంగా సిమ్లా నియోజకవర్గా నికి చెందిన బీజేపీ ఎంపీ సురేష్‌ కశ్యప్‌ తమ డిమాండ్లపై ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్‌ తన మ్యాని ఫెస్టోలో పండ్లు, పంటలకు ఎంఎస్పీని చేర్చిందని, ఇది అన్ని ఇతర పార్టీలకు ఆమోద యోగ్యంగా ఉంటుం దని చౌహాన్‌ అన్నారు. వాస్తవాలను కొందరు యూజర్లు బయటపెట్టిన తర్వాత కంగన తన ట్వీట్‌ను డిలీట్‌ చేశారని తెలిపారు.