పంట పండే భూములకు రైతు భరోసా వర్తింప చేయాలి..

– పండించిన పంటకు బోనుస్ ను ప్రకటించాలి
నవతెలంగాణ – ధర్మసాగర్
రైతులు పండించే పంట భూములకు మాత్రమే రైతు భరోసాను వర్తింపచేయాలని, అదేవిధంగా పండించిన పంటకు బోనస్ ను ప్రకటించాలని ఉమ్మడి మండలాల రైతులు ప్రభుత్వానికి తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. రైతుబంధు అమలుపై రైతుల అభిప్రాయ వేదిక కార్యక్రమం పిఎసిఎస్ వైస్ చైర్మన్ యాద కుమార్ అధ్యక్షతన మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు పాల్గొని రైతుల అభిప్రాయ సేకరణను వారి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉమ్మడి మండలాల రైతులు మాట్లాడుతూ  గత ప్రభుత్వం సాగు చేయని భూములకు, గుట్టలకు,పుట్టలకు, వెంచర్లకు ఇలా అనేక రకాల పడావుగా ఉన్న భూములకు రైతు బంధు వర్తింపజేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాలోచన చేసి ఈ కార్యక్రమం పెట్టినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.పండించిన పంటకు 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు రైతు భరోసా వర్తించే విధంగా ప్రభుత్వం చోరువ తీసుకోవాలని అన్నారు. రైతును రాజు చేసే విధంగా ప్రభుత్వాలు రైతుబంధు,రైతు భరోసా అనే కార్యక్రమాలను తీసుకురావడం హర్షించదగ్గ విషయమేనని అన్నారు. ఇది కష్టించి పనిచేసి పంటను పండించిన రైతుకు దక్కుతలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతంలో సబ్సిడీలతో 100% 50% 80% రైతుల గణన ప్రకారం సబ్సిడీలకు ఎరువులు విత్తనాలు రైతు పనిముట్లను అందజేసిన దాఖలు ఉన్నాయి. వాటి స్థానంలో రైతుబంధు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఉన్నోళ్లను ఉన్నోళ్లకే పెట్టిన సందర్భాలను గుర్తు చేశారు. ఇలా కాకుండా కౌలు రైతులకు, కష్టించి పనిచేసిన రైతుల పండించిన పంటకు బోనస్ను ప్రకటించే కార్యక్రమాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి ఎల్ పద్మ మాట్లాడుతూ 2018 నుండి నేటి వరకు ఉమ్మడి మండలాల రైతులకు 24 ఎకరాల విస్తీర్ణం గల రైతులకు 13 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగిందని తెలిపారు. తధానంతరం జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభిప్రాయ సేకరణ మేరకు తీసుకున్న ఈ కార్యక్రమం మీరు తెలిపిన వివరాలను ప్రకారం ప్రభుత్వానికి నివేదికను పంపిస్తానని ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు రండి రాజు యాదవ్, కొలిపాక వర్ణమాల, బొడ్డు శోభ, డైరెక్టర్లు బొడ్డులేని, వీరేశం, రగోతం రెడ్డి, రైతులు రాజిరెడ్డి, బండ భూపాల్ రెడ్డి, బొడ్డు ప్రభుదాస్, గంగారపు శ్రీనివాస్, బొడ్డు శాంతి సాగర్ తదితరులు పాల్గొన్నారు.