నవతెలంగాణ – రాయపోల్
జూన్ మాసం వచ్చిందంటేనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమై విత్తనాలు విత్తనం కోసం సన్నద్ధం చేసుకుంటారు. వాటికనుకూలంగా వర్షాలు కూడా కురవడంతో రైతులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా వరి పంట వేసే రైతులు నాటు వేసే కంటే ముందే జీలుగా పచ్చిరొట్టె విత్తనాలను పొలాలలో విత్తుకొని భూమి సారవంతంగా చేసుకుంటారు. కానీ ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ సరిపడా జీలుగా, పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేక రైతులు పడిగాపులుకాస్తున్నారు. రైతులు జీలుగా విత్తనాల కోసం ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. వర్షాలు కురవడంతో జిలుగు విత్తనాలను తమ పొలాల్లో చల్లి జీలుగులు పెరిగిన అనంతరం పొలంలోనే దున్ని ఎరువుగా తయారు చేసుకుంటారు. కానీ ఈ సంవత్సరం జీలుగు విత్తనాలు కొద్ది మోతాదులో మాత్రమే రాయపోల్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంకు రావడం జరిగింది. వందలాది మంది రైతులు జీలుగు విత్తనాల కోసం ఎదురుచూస్తుండగా కొంతమందికి రావడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. అటువంటి జీలుగు విత్తనాలు ఆలస్యంగా రావడమే కాకుండా తక్కువ మోతాదులో రావడం గమనార్హం. ప్రభుత్వం వెంటనే సరిపడా జీలుగు విత్తనాలు సరఫరా చేసి రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.