పూనే-బెంగళూరు హైవేపై రైతుల ధర్నా

పూనే-బెంగళూరు హైవేపై రైతుల ధర్నా– చెరకుకు అధిక ధర చెల్లించాలని డిమాండ్‌
కొల్హాపూర్‌ : తమ ఉత్పత్తులకు అధిక ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది చెరకు రైతులు గురువారం పూనే-బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. కొల్హాపూర్‌ నగరానికి చేరుకునే దారిపై వారు ధర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు ఇతర మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. చక్కెర మిల్లులు తమకు అదనపు చెల్లింపులు జరిపే వరకూ ఆందోళన కొనసాగుతుందని చెరకు రైతులు స్పష్టం చేశారు. పార్లమెంట్‌ సభ్యుడు, స్వాభిమాని షేత్కారీ సంఘటన్‌ నేత రాజు శెట్టి నేతృత్వంలో రైతులు ఆందోళన నిర్వహించారు. చక్కెర ధరలు పెరగడంతో మిల్లులు లాభాలు ఆర్జిస్తున్నాయని, కానీ వాటిలో కొంత భాగాన్ని రైతులకు బదిలీ చేసేందుకు అవి నిరాకరిస్తున్నాయని శెట్టి విమర్శించారు. గత సీజన్‌లో మిల్లులకు విక్రయించే చెరకు ధరకు ప్రభుత్వం ప్రకటించిన ఫెయిర్‌ రెమ్యునరేటివ్‌ ప్రైస్‌ (ఎఫ్‌ఆర్‌పీ) కంటే టన్నుకు రూ.400 అధికంగా చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇందుకు మిల్లుల యజమానులు ససేమిరా అంటున్నారు. ప్రతిష్టంభనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది విఫలమైంది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ధర్నాకు ముందు ప్రజల మద్దతు కూడగట్టేందుకు శెట్టి పాదయాత్ర చేశారు. చెరకు క్రషింగ్‌ సీజన్‌ ఈ నెల 1న ప్రారంభమైనప్పటికీ రైతుల ఆందోళనల కారణంగా చక్కెర మిల్లులు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు.